Arrangements Of Bhavani Deeksha Viramana : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 21 నుంచి 25 తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం జరుగనుంది. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారికి ఇరుముళ్లు సమర్పించడానికి భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. భవాని విరమణ దీక్ష ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తుల ప్రయాణం సులభతరం కోసం భవానీ దీక్షా యాప్ ను రూపొందించారు. భక్తులు దర్శనం, ప్రసాదాల కోసం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలన్నారు.
పటిష్టమైన ఏర్పాట్లు: ఈనెల 21 నుంచి 25 వరకు రోజుకు సుమారు లక్ష మంది చొప్పున దాదాపు 6 లక్షల మంది భవానీలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాదిగా భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. దసరా ఉత్సవాలు విజయవంతం చేసిన తరహాలో భవానీ దీక్షా విరమణల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ భవానీ దీక్షా విరమణ భక్తుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. క్యూ లైన్ల ఏర్పాట్లు వెయింటిగ్ హాళ్ళు, పార్కింగ్ స్థాలాలు, లడ్డూప్రసాదం, అన్నప్రసాదాల పంపిణీ వంటి వివరాలు యాప్ ద్వారా భక్తులకు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక టీమ్‌లను సిద్ధం చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నట్లు నగర పాలక సంస్థ కమీషనర్ హెచ్. యం.ధ్యాన చంద్ర తెలిపారు.
ఏర్పాట్లపై ఆలయ ఈవో: ఆలయ ఈవో కేఎస్ రామారావు మట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నామని.. అదే విధంగా సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద మొత్తం 800 వరకు షవర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గత అనభవాలను దృష్టిలో ఉంచుకొని లడ్డూ ప్రసాదానికి కొరత లేకుండా ఈసారి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో దీక్షా విరమణలు జరిగేలా వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తున్నామన్నారు.
''ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు భవానీ దీక్షలు విరమణ చేసుకుని త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం'' -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మిశ
''భవానీ దీక్షలు చేపట్టి దీక్ష విరమణ చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ భవాని దీక్షా 2024 (Bhavani Deeksha 2024) యాప్ ను వారి వారి ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని వారికి అవసరమైన దర్శనం, ప్రసాదాలను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ యాప్ ద్వారా భక్తులకు అవసరమైన పూర్తి సమాచారం అందుతుంది. అంతేకాకుండా భవానీ భక్తులు వారి దగ్గరలోని సచివాలయ పరిధిలో ఉన్న మహిళా పోలీస్ దగ్గరకు వెళితే వారు యాప్ ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెబుతారు'' - ఎస్.వి.రాజశేఖర్‌బాబు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్
''దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్షా విరమణలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా సీతమ్మవారి పాదాలు, పున్నమి ఘాట్, భవానీ ఘాట్ వద్ద మొత్తం 800 వరకు షవర్లు ఏర్పాటు చేస్తాం'' - ఆలయ ఈవో కేఎస్ రామారావు