Self Employed Vocational Skill Training Center in Khammam : ప్రస్తుతం యువతకు నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. డిగ్రీ పట్టాలు పొందినప్పటికీ నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఐదేళ్లుగా యువతకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నామమాత్రపు రుసుములతో ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, రిఫ్రిజరేటర్, ఏసీ మెకానిజం తదితర రంగాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. మూడు నెలల కోర్సు అనంతరం వారికి ధ్రువపత్రాలు అందిస్తున్నారు.
"మూడు నెలలకు జాయినింగ్ ఫీజు 1530. 30 మంది ఉంటారు. ఈ మూడు నెలల క్లాస్‌లు పూర్తి అయిన తర్వాత వాళ్లకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో పాస్ అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తాం. నేర్చుకున్న తర్వాత వారికి ఇంట్రెస్ట్ ఉందంటే కొలువు కూడా మేమే ఇప్పిస్తాం. ఇప్పటివరకు కూడా చాలా మంది సొంతంగా షాపులు పెట్టుకున్నవారూ ఉన్నారూ, వేరే పార్లర్ దగ్గర పని చేస్తున్నవారూ ఉన్నారు." - నిర్వాహితురాలు
మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువ : ఇటీవలి కాలంలో మహిళలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన వారు సొంతంగా దుకాణాలు పెట్టుకోవడం సహా నేరుగా వినియోగదారుల వద్దుకు వెళ్లి మేకప్ వేస్తూ ఉపాధి పొందుతున్నారు. డీసీఏ తదితర కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నవారికి ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలలు, ఇతర రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. కుట్టుమిషన్‌లో కటింగ్, స్ట్రిచ్చింగ్ వంటివి నేర్పిస్తున్నారు. శిక్షణతో పాటు అవసరమైన వారికి ఉద్యోగ అవకాశాలు చూపెడుతున్నారు. మరికొందరు స్వయం ఉపాధి పొందుతున్నారు.
"ప్రతి రోజు రెండు గంటల పాటు తరగతులు ఉంటాయి. పరీక్ష రాయాలంటే మినిమం పదో తరగతి చదివి ఉండి, పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే పరీక్ష రాయడానికి అర్హులు. ఆ సర్టిఫికేట్ మీద చిన్న చిన్న లోన్లు వస్తాయి. పీఎంజేవై లోన్లు, పర్సనల్ లోన్స్ లాంటివి వస్తాయి. ఆ లోన్స్‌తో సొంతంగా వ్యాపారం చేయవచ్చు. టైలరింగ్, బ్యూటీ పార్లర్, రిఫ్రిజిరేటర్ లేదా ఏసీ రిపేరింగ్ వంటివి చేయవచ్చు." - విద్యార్థి
ఇలాంటి నైపుణ్య కేంద్రాలు ఉండాలి : నైపుణ్య శిక్షణతో యువత వలస పోకుండా సొంత గ్రామాలలోనే ఉపాధి పొందవచ్చు. ఈ దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటే యువతకు మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉన్నచోటే ఉపాధిని ప్రభుత్వాలు కల్పించాలి. అప్పుడే హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు యువత వెళ్లకుండా ఉంటారు.
"ఈ మూడు నెలల్లో పిల్లలకు సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ కోచింగ్ తీసుకున్న వాళ్లలో చాలా మంది సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పొందారు. తమ దగ్గర ట్రైనింగ్ అయిన విద్యార్థులు సొంతంగా ఇంటర్నెట్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు." - ట్రైనర్
సెహగల్ సంస్థ అండతో మహిళల వ్యాపారం - నలుగురితో ఆరంభం - పదుగురికి ఆదర్శం