పెరుగుతున్న సీజనల్ వ్యాధులు - ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు - Seasonal Diseases in Telangana - SEASONAL DISEASES IN TELANGANA
Seasonal Diseases in Telangana : ఎండలతో అల్లాడిన జనానికి వర్షాలు ఉపశమనాన్నిస్తున్నాయి. అయితే వానలతో పాటు వచ్చే సీజనల్ వ్యాధులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. డెంగీ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులు వరుస కడుతున్నారు. విద్యాసంవత్సం ఆరంభంకావడంతో చిన్నారుల విషయంలో జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Published : Jul 8, 2024, 10:10 AM IST
Seasonal Diseases in Nizamabad : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పుమంటున్నాయి. అప్పుడప్పుడూ వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగీ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగులసంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు.
పెరుగుతున్న డెంగీ కేసులు : నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం 2వేలకు పైగా ఓపీ నమోదవుతోంది. అందులో ఎక్కువ భాగం వైరల్ జ్వరాలే ఉంటున్నాయి. గత ఆరు నెలల్లోనే 90కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాలతో డయేరియా రోగులు పెరుగుతుండగా ఈగలు, దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు జ‌్వరం, తదితర వ్యాధిలక్షణాలున్న చిన్నారులను బడికి పంపించొద్దని సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకే యాంటీ బయోటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. నిజామాబాద్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాడిన నూనెలు, రంపపు పొట్టు వంటివి వేస్తే దోమలు, కీటకాల లార్వాను అరికట్టొచ్చని వివరిస్తున్నారు.
"వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దోమకాటు వల్ల డెంగీ వచ్చే అవకాశం ఉంది. స్కూళ్లు, ఇంటి పరిసరాలలో మురికి నీటి కాలువలు, నిల్వ ఉన్న డబ్బాలు, టైర్లు, చెత్త లేకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో వాడిన నూనెలు, రంపపు పొట్టు వంటివి వేస్తే దోమలు, కీటకాల లార్వాను అరికట్టొచ్చు. వైద్యుల సలహా మేరకే యాంటీ బయోటిక్స్ తీసుకోవాలి." - నరేంద్ర కుమార్, ఆర్‌ఎంఓ
Seasonal Diseases in Telangana : వాతావరణంలో మార్పులు.. జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు
5 నిమిషాల్లో అద్దిరిపోయే మిరియాల చారు - సీజనల్ జ్వరాలకు సూపర్ రెమిడీ! - Miriyala Charu Recipe