Scheduled Hours to Meet Inspectors : ఆపదలో ఉన్నా, అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పోలీస్ స్టేషన్ ఒక్కటే. అర్ధరాత్రి వెళ్లినా పోలీసులు ఆదుకుంటారని ప్రతి ఒక్కరి భరోసా. అలాంటి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడానికి, అధికారులను కలవడానికి సమయం నిర్దేశిస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రంలోనే అత్యధికంగా సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యే సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సరిగ్గా ఇదే జరుగుతోంది. ఈ పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్లను కలిసేందుకు నిర్దేశిత వేళలు నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసు పురోగతి గురించి తెలుసుకోవడానికి, ఎఫ్ఐఆర్ ప్రతి తీసుకోవడానికి ప్రతి రోజూ సాయంత్రం 4-6 గంటల మధ్య మాత్రమే రావాలని సిబ్బంది సూచిస్తున్నారు. పొరపాటున ఈ సమయం దాటితే ఫిర్యాదుదారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సైబర్ నేరాల్లో రూ.లక్షలు, రూ.కోట్లు పోగొట్టుకుని తిరిగి డబ్బు ఎప్పుడు వస్తుందోననే ఆశతో ఎంతో దూరం నుంచి వచ్చిన తమను సమయం మించిపోయిందని అడ్డకోవడం ఏంటని బాధితులు వాపోతున్నారు. ఈ నిర్దేశిత సమయాల వెనుక ఓ అధికారి ఆదేశాలు ఉన్నట్లు సమాచారం.
ఆ సమయాల్లో వస్తేనే : గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఆవరణలోనే సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ఉంది. సైబర్ నేరంలో రూ.50 వేల కంటే తక్కువ మొత్తంలో కోల్పోతే స్థానిక శాంతి భద్రతల పోలీస్ స్టేషన్‌లో, అంతకంటే ఎక్కువ మొత్తంలో పోగొట్టుకుంటే కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయాలి. సైబర్ క్రైమ్ ఠాణాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 9,400లకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ఇతర పోలీస్ యూనిట్లతో పోలిస్తే ఇక్కడే అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. రోజూ సగటున 25 వరకు కేసులు రిజిస్టర్ అవుతుంటాయి. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపై ఎలాంటి ఆంక్షలు లేకున్నా, కేసు నమోదయ్యాక పురోగతి వివరాలు తెలుసుకోవడానికి నిర్దేశిత సమయాలు పెట్టడం సమస్యగా మారుతోంది.
నిబంధన పెట్టడం ఏంటి? : సాధారణ నేరాలతో సైబర్ నేరాల పరిస్థితి విభిన్నం. డబ్బు కోల్పోయిన తర్వాత సకాలంలో నేరస్థుల ఖాతాలు ఫ్రీజ్ చేసి బాధితులు పోగొట్టుకున్న డబ్బు తిరిగి వాపస్ ఇచ్చే విధానముంది. దీనికి పోలీసులు చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు కోర్టు అనుమతి, బ్యాంకులు ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయడం, ఇలా అనేక దశలుంటాయి. దీనికి రోజుల తరబడి సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదయ్యాక ఫిర్యాదుదారులు తమకు వాపస్ రావాల్సిన డబ్బు, బ్యాంకు ఖాతాల అన్‌ఫ్రీజ్ దర్యాప్తు పురోగతి తెలుసుకోవడానికి పదే పదే ఠాణాకు వచ్చి దర్యాప్తు అధికారుల్ని ఆరా తీస్తుంటారు.
కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు బాధితులు అదే సంఖ్యలో ఉంటారు. ఇలా పదుల సంఖ్యలో బాధితులు వచ్చినప్పుడు వారిని కలిసేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపకుండా ఫలానా సమయానికి రావాలంటూ నిబంధన పెట్టడం ఇబ్బంది కరంగా ఉంటోందని బాధితులు వాపోతున్నారు. కొందరు పనులు మానుకుని ఎంతో దూరం నుంచి వస్తున్నారు. తీరా సమయం దాటిపోయిందని సిబ్బంది లోపలికి వెళ్లనీయకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
రూ.19 వేలకు ఆశపడి - రూ.10.10 కోట్లు పోగొట్టుకున్న అకౌంటెంట్ - అమ్మాయి చెప్పింది కదా అని నమ్మి!