Save Rocks in Telangana : భౌగోళిక పరిస్థితుల వల్ల దక్కన్ పీఠభూమి ఏర్పడింది. లావా వ్యాపించి భూ ఉపరితలంపై గట్టి రాతి పొర, శిలలు ఏర్పడ్డాయి. గాలి, వానలతో శిలలు విభిన్న ఆకృతులను సంతరించుకున్నాయి. అయితే విలువైన ఖనిజాలుండటంతో పాటు, నిర్మాణాల్లో భాగంగా శిలలను ధ్వంసం చేస్తున్నారు. దీంతో వీటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వీటిని భవిష్యత్ తరాలకు సైతం చూపించాలనే ఉద్దేశంతో సొసైటీ టు సేవ్ రాక్స్ ఏర్పడింది.
Society to Save Rocks Organization : 1996లో ఏర్పడిన ఈ సొసైటీ శిలలు (Rocks in Telangana) గుట్టల ప్రాముఖ్యత గురించి సామాన్యుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతోంది. ప్రతి నెలా మూడో వారంలో రాకథాన్స్ నిర్వహిస్తూ, రాతి గుట్టల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేలా కృషిచేస్తోంది. పురాతనమైన వీటిని ధ్వంసం చేస్తే భవిష్యత్ తరాల వాళ్లు వీటిని చూడలేరని అలాంటి రాక్స్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సొసైటీ టు సేవ్ రాక్స్ సభ్యులు చెబుతున్నారు.
Rock Museum In Hyderabad: 3.3 బిలియన్ ఏళ్ల పురాతన శిలలతో 'రాక్ మ్యూజియం'..
శిల అంటే కేవలం రాయిగానే చాలా మంది భావిస్తారు. కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది. అందులో దాగి ఉన్న రూపాన్ని కెమెరాతో బంధించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సొసైటీ టు సేవ్ రాక్స్ సభ్యుడు అశోక్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆరేళ్లలో దాదాపు 2,000ల ఛాయాచిత్రాలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు అంతర్జాతీయంగా యూకే, యూఎస్‌లోనూ ఫోటోలు తీశారు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఉద్యోగిగా ఉంటూ ఫోటోగ్రఫీ ప్రవృత్తిగా ఎంచుకొని అందులో శిలలు, గుట్టలు ప్రతిబింబిస్తున్న ఆకారాలను ఫోటోలు తీస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
" శిలల్లో నిల్వ ఉండే నీటి వల్ల పక్షులు, జంతువులకు, కీటకాలు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. హైదరాబాద్‌లో పట్టణీకరణ కారణంగా శిలలు, గుట్టలు ధ్వంసం అవుతున్నాయి. అలా కాకుండా రాళ్లనే అలాగే ఉంచి వాటి చూట్టూ పనులు చేయవచ్చు. శిలల ధ్వంసం వల్ల జీవవైవిద్యం దెబ్బ తింటోంది. అందుకే మా సొసైటీ శిలల ఫొటోలను తీసి వాటి పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం." - అశోక్, సొసైటీ టు సేవ్ రాక్స్
పూర్వకాలంలో నిర్మాణాలు చేసినా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిలలు, గుట్టలకు ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ ప్రస్తుతం డైనమెట్‌లు ఉపయోగించి వీటిని ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోందని సొసైటీ టు సేవ్ రాక్స్ అవగాహన కల్పిస్తోంది. ఈ సంస్థ కొన్నేళ్ల పోరాటాల ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 25కు ఫైగా రాక్ ఫార్మేషన్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రక ప్రాంతాలుగా గుర్తించాయి.
తుర్కపల్లిలో అరుదైన వీరగల్లు శిల్పాలు లభ్యం
ఎన్నో గుట్టల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు : రాచకొండ, మౌలాలీ, గోల్కొండలో సొసైటీ టు సేవ్ రాక్స్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌కు వెళ్లే దారిలో ఉన్న ఎన్నో గుట్టల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖాజాగూడ వద్ద ఉన్న ఫక్రుద్దీన్ గుట్టను రక్షించేందుకు ఈ సొసైటీ పోరాడుతోంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చినా ఉల్లంఘనలు జరుగుతున్నాయి. దీనిపై సొసైటీ సభ్యులు పోరాటం చేస్తున్నారు.
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా గండికోట వద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లోయ గురించి ఎలుగెత్తి చాటుతున్నారు. అమెరికాలోనూ ఇలాంటి లోయే ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ లోయకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. గుట్టలు, శిలలను ధ్వంసం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సొసైటీ టు సేవ్ రాక్స్ విజ్ఞప్తి చేస్తోంది.
Iron Age Landmarks మూసాపేటలో ఇనుపయుగం ఆనవాళ్లు
Historical Rocks Found in Yadadri : యాదాద్రిలో అలనాటి ఆనవాళ్లు.. ఫొటోలు చూశారా..?