Sangareddy Young Poet Anitha Success Story : కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల తేనెలూరే తెలుగుకు దూరమవుతున్నారు నేటితరం. అందకు భిన్నంగా చిన్ననాడే పద్యరచనపై ఆసక్తి పెంచుకుందీ యువతి. 8వ తరగతిలో మొదలుపెట్టి, 2 ఏళ్లలోనే వందల పద్యాలు రాసి ఔరా అనిపించింది. ప్రపంచ తెలుగు మహా సభల్లో బంగారు తెలంగాణ శతకం విడుదల చేసి, తెలుగు పండితులను అబ్బురపరిచింది. కెరీర్‌లో రాణిస్తూనే మాతృభాష అభివృద్ధికి కృషి చేస్తోంది.
పద్యాలు రాస్తున్న ఈ యువతి పేరు అనిత. సంగారెడ్డి జిల్లా ఆందోల్ పరిధిలోని కంసాన్‌పల్లికి చెందిన చంద్రకళ, కిష్టయ్యల కుమార్తె. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. బీటెక్ పూర్తిచేసి ప్రస్తుతం టీసీఎస్‌లో పనిచేస్తోంది. ప్రాథమిక పాఠశాల దశ నుంచే తెలుగుపై ఇష్టం పెంచుకుంది అనిత. తోటి విద్యార్థులు పద్యాలు చదివేందుకే భయపడుతుంటే, ఈమె మాత్రం అవలీలగా నేర్చుకుని ఆశ్చర్యపరిచేది.
అనిత జీవితంలో మరో మలుపు : తెలుగు టీచర్ రమేశ్ గౌడ్ ప్రోత్సాహంతో తొలిసారి పద్యరచన చేసింది అనిత. తప్పులు లేకుండా రాశావంటూ సర్ మెచ్చుకోవడంతో హైస్కూలు దశలోనే దాదాపు 200 పద్యాలు కూర్చి వార్తల్లో నిలిచింది. ఇది చూసి నర్సాపూర్ బీవీఆర్ఐటీ కళాశాల యాజమాన్యం ఉచితంగా చదివే అవకాశం కల్పించింది. అనిత జీవితం మరో మలుపు తిరిగింది. 9వ తరగతి నుంచి బీటెక్ వరకూ నిరాటంకంగా చదువు పూర్తిచేసి కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదిగింది.
"మా టీచర్ ఈశ్వరయ్య నా అక్షరభ్యాసం నుంచి ఏ తప్పులు దొర్లకుండా నన్ను తీర్చిదిద్దారు. తరువాత ప్రభుత్వ పాఠశాలలో సైతం రాజయ్య సర్ ప్రోత్సాహంతో ఛందస్సుతో పద్యాలు రాసే విధానం నేర్చుకున్నాను. అలా ఆటవెలది పద్యాలు రాయటం అందులో గణాలు, పదాలు అన్ని కుదరటానికి తొలుత కాస్త సమయం పట్టింది. మరోవైపు నా విద్యాభ్యాసం పూర్తైంది."-అనిత, పద్య రచయిత
బీటెక్ చదివేటప్పుడే బంగారు తెలంగాణ శతకం : ఇంజినీరింగ్ చదివే సమయంలోనే బంగారు తెలంగాణా శతకం రచించింది అనిత. దీన్ని ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆవిష్కరించి ప్రముఖ తెలుగు పండితులు, భాషాభిమానుల ప్రశంసలు అందుకుంది. 1900 కంద పద్యాలు, 3 ఆటవెలది, ఒక తేటగీతి సహా మొత్తం 23 శతకాలు రాసింది. సమయానుకూలంగా అప్పటికప్పుడు అలవోకగా పద్యాలు అల్లేస్తూ వహ్వా అనిపిస్తోంది.
తెలుగు మాట్లాడటమే అవమానంగా భావిస్తున్న రోజుల్లో తనదైన శైలిలో మాతృభాష పరిరక్షణకు పాటు పడుతోంది అనిత. పద్యరచన చేస్తున్నా చదువు ఎప్పుడూ విస్మరించలేదని అంటుంది. అలానే కన్నతల్లిని, అమ్మభాషనూ చిన్నచూపు చూసే రోజుల్లో తమ శిష్యురాలు తెలుగు పద్యాలతో గుర్తింపు తెచ్చుకోవడం ఆనందం కలిగిస్తోందని అంటున్నారు అనిత గురువులు. వెంకటేశ్వర సుప్రభాతంలోని 76 పద్యాలను సంస్కృతంలోంచి తెలుగులోకి అనువదించే స్థాయికి ఎదిగి తమ పేరు నిలబెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పరాయి భాషపై మోజుతో తెలుగు భాష మాధుర్యం నేటితరం గుర్తించలేకపోవడం దురదృష్టకరమని అంటోంది అనిత. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఉపాధి అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయంతో అమ్మభాషను దూరం చేసుకోవడం తగదని సూచిస్తోంది. మాతృభాష వల్ల కలిగే ప్రయోజనాలు గుర్తించలేక, తెలుగు మాధ్యమంలో చదివేందుకు అనాసక్తి చూపిస్తున్నారు నేటితరం. కానీ అమ్మభాషనే ఆలంబనగా చేసుకుని కెరీర్ ఉన్నతంగా తీర్చిదిద్దుకుంది అనిత. భవిష్యత్తులోనూ విభిన్న అంశాలపై పద్యరచన చేసి సమాజాన్ని చైతన్య పరుస్తానని చెబుతోంది.