Sangareddy Teacher is Training for Employment Along With Education : సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన వీబీ శ్రీనీవాస్ ప్రస్తుతం జోగిపేట హైస్కూల్ పీఈటీగా పనిచేస్తున్నారు. నిత్యం పాఠశాలకు వెళ్లడం, పిల్లలను ఆటలాడించడం ఇది ఆయన విధి. దీనికి భిన్నంగా మరో అడుగు ముందుకేశారు. ఓ వైపు వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే మరోవైపు యవకులను కానిస్టేబుల్, సాయుధ దళాల ఉద్యోగాల సాధనకు శిక్షణ ఇస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి మెళుకువలు నేర్పిస్తున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ కొలువులను సాధించారు. తమ గురువు ఇచ్చిన ప్రోత్సాహంతోనే పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించామని విద్యార్థులు చెబుతున్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడంలో వ్యాయామ ఉపాధ్యాయులు వీబీ శ్రీనివాస్‌కి మంచి పట్టుంది. వారి ఆసక్తిని బట్టి జీవితంలో ఎటువైపు వెళ్లాలి అనుకుంటున్నారో అంచనా వేసి దానికి అనుగుణంగా వారిని మానసికంగాను, శారీరకంగాను తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థుల్లో ఉన్న కాళాత్మకానికి మెరుగులు దిద్దుతూ, తమ వంతు సహకారంగా వారికి ప్రోత్సహాకన్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గురువు శిక్షణలో వందల సంఖ్యలో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని కప్పులను గెలుచుకున్నారు.
"మాకు స్కూల్ సాయంత్రం 4గంటల వరకే ఉండేది. కానీ సార్ మా కోసం ఉండి గేమ్స్ ఆడించేవారు. అలా మేము శారీరకంగా ఎంతో దృఢంగా అయ్యాము. క్రమశిక్షణ గురించి చేప్పేవారు. సార్ ముందు కానిస్టేబుల్ అందుకే విద్యార్థులను ముందుగా గుర్తించి శిక్షణ ఇచ్చేవారు. ఆయన సాయం వల్లనే మేము ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం." - విద్యార్థులు
జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు సొంతం చేసుకోవడం అంత సులువుకాదు. దానికి ఎంతో శ్రమ, వృత్తిపై పట్టు, సాధించిన ఫలితాలు వారికి ఘనతను తెచ్చిపెడతాయి. తమ పరిధిని దాటి పని చేసినప్పుడు ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆందోల్ క్రీడాకారుల ఘనతను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడంలో వీబీ శ్రీనివాస్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆయన 11 సంవత్సరాలు కృషితోనే ఇది సాధ్యమైంది. అంతేగాక క్రీడల్లో టార్గెట్ బాల్ అనే నూతన ఆటను అందుబాటులోకి తీసుకొచ్చి ఆందోల్‌లోనే జాతీయ స్థాయి క్రీడాపోటీలు నిర్వహించిన ఘనత కూడా ఈయన సొంతం.
చదువుకున్న చదువుకు ఫలితం తప్పనిసరిగా ఉండాలని 2002 వరకు పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. కానీ తమకు ఇష్టమైన క్రీడారంగాన్ని వదులుకోలేక పోలీస్ ఉద్యోగానికి పుల్‌స్టాప్ పెట్టి 2002 డీఎస్సీ ద్వారా వ్యాయామ ఉపాధ్యాయుడిగా కొలువు సాధించారు. అప్పటి నుంచి తన గురువు పరశురాం గౌడ్ వద్ద శిక్షణ తీసుకుని ఎదిగాడు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు విద్యార్థులకు క్రీడలపై తర్ఫీదు ఇస్తున్నారు.
వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులుగా రానిస్తూ : ఈయన వద్ద శిక్షణ పొందిన ఐదుగురు పోలీస్ శాఖలో కొలువులు సాధించారు. మరో 29 మంది వ్యాయామ ఉపాధ్యాయులుగా రాణిస్తున్నారు. ఆర్మీలో మరి కొంత మంది పనిచేస్తున్నారు. క్రీడల్లో మహిళలు ఉండాలన్న లక్ష్యంతో బాలికలకు బాస్కెట్ బాల్ కోర్టును దాతల సాయంతో సరికొత్తగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ రాష్ట్ర స్థాయిలో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా వ్యాయామాలు చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని ఉత్తమ ఉపాధ్యాయులు వీబీ శ్రీనివాస్ సూచిస్తున్నారు.