Property purchase In Hyderabad : ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే ఇళ్లు, ప్లాట్ల రేట్లు పెరగడంతో పాటు వివాదాలు కూడా పెరిగిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ మోసాలతో కొనుగోలుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఏదైనా ప్లాట్, ఇళ్లు కొనేటప్పుడు వాటికి సంబంధించిన పత్రాలు ఒకటికి రెండు సార్లు గమనించి ఆలోచించి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్లోని శివారులో తక్కువ ధరకే లేఅవుట్ ఉందని దీనికి హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ అనుమతులు తీసకున్నామని ఎవరైనా ప్లాట్లు లేదా ఇండ్లు అమ్మకానికి పెడితే ఆలోచించుకొని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొందరు మోసగాళ్లు లేఅవుట్ లేదా భవనాల నిర్మాణాలకు హెచ్ఎండీఏ, డీటీసీపీలకు దరఖాస్తు చేసుకొని అనుమతులు రాకముందే ప్లాట్లు, ఇళ్లను అమ్మకానికి పెడుతున్నారు. ముఖ్యంగా శంషాబాద్, మేడ్చల్, శంకర్పల్లి జోన్లలో ఈ దందా ఎక్కువగా జరుగుతోంది.
ప్లాట్లు కొనేటప్పుడు ఇవి గమనించండి : రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 421 ఎకరాల్లో లేఅవుట్ ఉందని, డీటీసీపీ అనుమతులు కూడా తీసుకున్నట్లు అవతలి వ్యక్తులు చెప్పడంతో గుడ్డిగా నమ్మిన ఓ వ్యక్తి వారికి దాదాపు రూ.30 లక్షలపైనే ఇచ్చి మోసపోయాడు. విషయం తెలుసుకొని లబోదిబోమంటూ ఇటీవల పోలీసులను ఆశ్రయించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లకు, అయిదు అంతస్తులు అంతకు మించిన భవనాలకు హెచ్‌ఎండీఏ, జిల్లాల్లో డీటీసీపీ నుంచి అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. హెచ్‌ఎండీఏ నుంచి ఎల్‌పీ నంబరు, డీటీసీపీ సంబంధించి అనుమతుల వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్లాలి.
మార్టిగేజ్‌లో ఉన్న ప్లాట్లు : ముఖ్యంగా లేఅవుట్లలో ప్లాట్లు కొనేముందే భూ యజమాని వివరాలు, లింకు డాక్యుమెంట్లు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. మార్టిగేజ్ ప్లాట్లను అంటగట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ప్లాట్లు తక్కువకే అమ్ముతున్నామని చెబుతుంటారు. మార్టిగేజ్‌లో ఉన్న ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు సరికదా అందులో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు. ఇది తెలుసుకొని తీసుకోవాలి. కోర్టు కేసులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఉన్న ప్లాట్లు, ఇళ్లు ఎంత తక్కువకు విక్రయించాలని చూసినా సరే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేఅవుట్లో మౌలికవసతుల కల్పన, మార్టిగేజ్ ప్లాట్లు ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవాలి.