Sahithi Infra Victims Protest At CCS : హైదరాబాద్ బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ముందు సాహితీ ఇన్ఫ్రాటెక్ కంపెనీ బాధితులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి అమీన్పూర్లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ తమ వద్ద నుంచి సుమారు రూ.1500కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. వందల కోట్లు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న కేసు దర్యాప్తు కొలిక్కి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది కష్టార్జితంతో డబ్బులు పెట్టామని తమకు స్థలం లేక నగదు తిరిగి ఇప్పించాలని కోరారు. తక్షణమే ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు మొదలైనప్పటి నుంచి ముగ్గురు అధికారులు మారారని, కొత్తవారు వచ్చినప్పుడల్లా విచారణ మొదటికి వస్తుందని మండిపడ్డారు. 1200 కుటుంబాలు ఈ స్థలాలను నమ్ముకుని బతుకుతున్నామని బాధితులు గోడును వెల్లబోసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించుకుందాం అన్నా వారు ఎన్నికల బీజీ ఉండడంతో కలవడం కుదరండం లేదని వాపోయారు. ఇకనైన వారు జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని బాధితులు కోరారు.
ప్రీ లాంచ్ పేరుతో రూ.1164 కోట్లు వసూలు - సాహితీ ఇన్ఫ్రాపై 50 కేసులు నమోదు
"నేను ఇందులో 40లక్షలు పెట్టాను. స్థలం కోసం మాలాగా 1200 కుటుంబాలకు పైగా ఇందులో డబ్బులు కట్టారు. అందరు వచ్చి ధర్నా చేయడానికి లేదు. కేసు వేశాం కానీ విచారణ సరిగ్గా జరగంలేదు. ఎండీ అరెస్టై బయటకు వచ్చి తిరుగుతున్నారు. విచారణ చేస్తున్న పోలీసులను అడిగితే వారిని అరెస్టు చేయడానికి మా దగ్గర సరిపడ ఆధారాలు లేవని అంటున్నారు. మేము కష్టపడి డబ్బులు కట్టాం. ముఖ్యమంత్రిని కలుద్దాం అంటే మాకు అవకాశం రావడం లేదు. మమ్మల్ని చూసి ఆయన స్పందించి విచారణ జరిపించాలని కోరుకుంటున్నాం." - బాధితురాలు
గత అయిదు సంవత్సరాలుగా డబ్బులు కడుతున్నాం. రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్యపై పోరాడుతున్నా తమకు సరైన న్యాయం జరగడం లేదని బాధితులు వాపోయారు. దీనిపై విచారిస్తున్న పోలీసు అధికారులను ఎండీ లక్ష్మీనారాయణను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తే సరిపడ ఆధారాలు లేవని వాటితో ఆయన్ను అరెస్టు చేయలేమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని అంటున్నారని చెప్పారు.
Telangana HC on sahiti infra case: సాహితీ ఇన్ఫ్రా కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రీలాంచ్ పేరుతో రూ.900 కోట్ల మోసం.. తితిదే బోర్డు సభ్యుడు అరెస్టు