Saddula Bathukamma Celebrations 2024 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు, యువతులు అంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబరాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో నగరంలోని ట్యాంక్‌బండ్ పరిసరాలు కాంతులీనాయి. వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క బతుకమ్మను భావితరాలకు అందిద్దామని సూచించారు.
ఊరూరా సద్దుల బతుకమ్మ వేడుకలు : రాష్ట్రమంతటా వేలాది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని ఆనందంగా ఆడిపాడారు. వేలాది మంది మహిళలు, పిల్లలతో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం జనసంద్రంగా మారింది. కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత కోలాహలంగా సాగుతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు నేటితో ముగిశాయి.
బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం : హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై జరిగిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మహిళలు బతుకమ్మను ఆడుతున్నారని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేడుకల్లో మంత్రితో పాటు మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో లేజర్ షో అందరినీ అలరించింది.
బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ. తెలంగాణ అంటేనే చెరువులు కుంటలు. తెలంగాణలో చెరువులతో ప్రతి ఊరికి అనుబంధం ఉంటుంది. బతుకమ్మ ఒక జీవమని అందులో చేర్చే ప్రతి పువ్వుకు జీవం ఉంది. బతుకమ్మ ద్వారా చెరువులు శుద్ధి అవుతాయి - సీతక్క, రాష్ట్ర మంత్రి
జిల్లాల్లోనూ ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు : మరోవైపు జిల్లాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. ఏ ప్రాంతంలో చూసినా బతుకమ్మ పాటలతో సందడి వాతావరణం కనిపించింది.
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం - జగమేలుతోన్న మన బతుకమ్మ