Rythu Runa Mafi Third Phase : రాష్ట్రంలో మూడో విడత రైతు రుణమాఫీ పథకం కింద పలువురికి శుక్రవారం నుంచి నిధుల జమ అవుతున్నాయి. గురువారం పంద్రాగస్టు నాడు సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లా వైరా సభలో మూడో విడత రుణమాఫీను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, ఆ రోజు బ్యాంకులకు హాలీడే కావడంతో శుక్రవారం నుంచి నిధుల జమపై రైతులకు ఎస్‌ఎంఎస్‌లు వస్తున్నాయి. అయితే.. రూ.2 లక్షల్లోపు రుణం ఉన్న రైతుల అకౌంట్లలోనే డబ్బులు పడుతున్నాయని.. ఆ మొత్తం దాటిన వారికి జమ కాలేదని సమాచారం.
"ఆగస్టు 15 సెలవు రోజు కావడంతో మూడో విడత నిధులు జమ కాలేదు. శుక్రవారం నుంచి రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. రూ.2 లక్షలు దాటిన వారికి ఎప్పుడు చెల్లించాలనే దానిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది."-వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు
రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే.. అదనపు మొత్తాన్ని చెల్లించాకే రుణమాఫీ అమలు చేయాలని గవర్నమెంట్ తొలుత నిర్దేశించింది. ఇందుకు సంబంధించి తాజా మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది.
గడువు నిర్దేశిస్తారా?
రుణమాఫీపై జారీ అయిన జీవో 567లో కొన్ని ముఖ్యమైన పాయింట్లున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 4.11 నిబంధనలో.. "ఏ కుటుంబానికి అయితే రూ.2 లక్షలకు మించి లోన్ ఉంటుందో ఆ అదనపు మొత్తాన్ని తొలుత వారు బ్యాంకుకు చెల్లించాలి. తర్వాత రూ.2 లక్షలను వారి రుణ అకౌంట్లకు ప్రభుత్వం జమ చేస్తుంది" అని ఉంది. 4.12 నిబంధనలో ఏముందంటే.. "ఆ కుటుంబంలో లోన్ తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, తదుపరి దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి" అని ఉంది.
దీని ప్రకారం రూ.2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్నవారు అదనపు మొత్తాన్ని చెల్లించిన తర్వాతే ప్రభుత్వం మాఫీకి సంబంధించిన మొత్తాన్ని జమ చేస్తుంది. దీని కోసం రైతులకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మూడో విడత రుణమాఫీ ప్రారంభానికన్నా ముందే ఈ విషయమై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నా.. అది ఇంకా జరగలేదు.
మరోవైపు రూ.2 లక్షలు దాటి లోన్ ఉన్న కుటుంబంలో మహిళలు లేని పక్షంలో తండ్రికి ముందుగా రుణమాఫీ చేయాలా లేదా కుమారునికా అనే సందిగ్ధత ఉంది. వీటన్నింటిపై రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూాడా చదవండి :
'రుణమాఫీ' మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి - రాజీనామా చేయాలంటూ హరీశ్‌రావుకు సవాల్
కౌంట్ డౌన్ స్టార్ట్ - మరో 24 గంటల్లో రైతులకు రూ.2 లక్షల రుణం మాఫీ