Rythu Bharosa Release Date 2024: అన్నదాతలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు మోక్షం లభించినుందా? అంటే.. అవును అనే సమాధానం ఇస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరి.. ఇదే నిజమైతే రైతుల అకౌంట్లలో నిధులు ఎప్పుడు జమ కానున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
రైతులకు పెట్టుబడి కోసం ఆర్థికసాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 'రైతుబంధు' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దీన్ని 'రైతు భరోసా'గా మార్చింది. ఈ రైతు భరోసా నిధులు అన్నదాతలకు జులైలోనే అందాల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. దసరా కానుకగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కారు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 12న దసరా పండగ ఉన్న నేపథ్యంలో.. అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మార్గదర్శకాల సంగతేంటి..?
రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయనే వార్తలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయనుందనే విషయంలో మాత్రం ఆందోళనతో ఉన్నారు. రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలనే విషయమై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వలేదు. అందరికీ కాకుండా.. చిన్న, సన్నకారు రైతులకే ప్రయోజనం కలిగించేలా.. కటాఫ్ విధిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి.. ఆ కటాఫ్ ఎంత ఉండనుంది? ఎన్ని ఎకరాల భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు అందుతాయి? అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో.. తమకు పెట్టుబడి సాయం అందుతుందా? లేదా? అని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై.. ఈ నెలాఖరులోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
పెరుగుతుందా..?
రైతు భరోసా నిధులు ఎంత ఇస్తారనే విషయంలోనూ అన్నదాతల్లో చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం రూ.15 వేలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మరి.. పెరిగిన డబ్బు అందుతుందా? లేదంటే.. గత ప్రభుత్వం ఇచ్చినంత సొమ్మునే అకౌంట్లో వేస్తుందా? అనే విషయమై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.