RTC Sanitation Workers Problems in Vijayawada Bus Stand: రేయింబవళ్లు చెమటోడ్చినా అరకొర జీతమే. బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నా వారు అనారోగ్యం బారిన పడితే పట్టించుకునే నాథుడే లేడు. ఏళ్లుగా ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికుల శ్రమను దోచుకుని కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఆప్కాస్‌లో కలిపి కనీస వేతనాలు ఇస్తామని గద్దెనెక్కిన గత వైఎస్సార్సీపీ సర్కార్ వారిని నట్టేట ముంచింది. కుటుంబ పోషణ కష్టమై, బతుకు భారమై అష్టకష్టాల్లో కార్మికులు బతుకీడుస్తున్నారు. కొత్త ప్రభుత్వంతోనైనా కష్టాలు తీరతాయని గంపెడాశలు పెట్టుకున్నారు.
ప్రయాణికులు తిని పడేసిన వ్యర్థాలను ఊడ్చూతూ మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లో పని చేస్తున్న వీరంతా ఔట్ సోర్సింగ్ కార్మికులు. వేలాది మంది రాకపోకలతో కిటకిటలాడే బస్టాండ్‌లో 24 గంటల పాటు సేవలందిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. కానీ నేటికీ కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపైనే వీరి కొలువులు ఆధారపడి ఉన్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేసినా వీరికి దక్కేది చాలీచాలని వేతనాలే. షిఫ్టుకు 50 మంది చొప్పున 150 మంది కార్మికులు ఏళ్లుగా పని చేస్తున్నా వీరిలో ఏ ఒక్కరి జీతం 10 వేలు దాటడం లేదు. ఉద్యోగ భద్రత లేదు. వీరిదే కాదు రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లు, డిపోల్లో పనిచేసే వేలాది మంది ఔట్ సోర్సింగ్ కార్మికులదీ ఇదే దుస్ధితి.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులను ఆప్కాస్‌లో కలిపి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని నమ్మబలికిన మాజీ ముఖ్యమంత్రి జగన్ వీరిని నట్టేట ముంచారు. విలీనం పేరిట 52 వేల రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో కలిపి 7,300 మందిపైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గాలికొదిలేశారు. కాంట్రాక్టర్ల దోపిడీ నుంచి విముక్తి కల్పిస్తాన్న వారే కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్ల వ్యవస్థను కొనసాగించారు. కమిషన్లకు అలవాటు పడిన కొందరు అధికారులు సైతం వారితో కుమ్మక్కు కావడంతో వీరికి శాపమైంది. హామీలు నెరవేర్చాలని వేతనాలు పెంచాలని ఐదేళ్లుగా ఉన్నతాధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్ట ప్రకారం ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసే స్కిల్డ్ వర్కర్లకు కనిష్టంగా 15,366 రూపాయలు తప్పని సరిగా ఇవ్వాలి. అనుభవాన్ని బట్టి గరిష్టంగా 21 వేల పైనే వేతనం ఇవ్వొచ్చు. పీఎఫ్, ఈఎస్ఐ తప్పని సరిగా అమలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి. పాతికేళ్లపైగా అనుభవం ఉన్న ఈ వేతన జీవులకు మాత్రం ఇవేమీ వర్తించడం లేదు. ఒక్కో కార్మికుడి వేతనం నుంచి కమిషన్ పేరిట కాంట్రాక్టర్లు 4 వేల రూపాయలపైనే కోత పెడుతున్నారు. మిగిలిన వేతనాన్ని నగదు రూపంలో ఇస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆప్కాస్‌లో కలిపి కనీస వేతనాలు ఇవ్వాలన్న డిమాండ్ అరణ్య రోధనగానే మిగిలిందని మహిళా కార్మికులు వాపోతున్నారు.
శిథిలావస్థకు చేరిన బద్వేల్ బస్టాండ్ - ప్రజల ప్రాణాలతో ఆర్టీసీ చెలగాటం - Dilapidated RTC bus Stand
ఐదేళ్ల పాటు సీఎం సహా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేశారిన కార్మికులు నరకయాతన అనుభవించారు. చంద్రబాబుతోనే న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి ఓటేసి గెలిపించామంటున్నారు. ఇటీవల బస్టాండ్‌కు వచ్చిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిసి కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల తరహాలో 16 వేల వేతనం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఆర్టీసీ పేరుకే ప్రభుత్వ రంగ సంస్థ అయినా కనీస వేతన చట్టం అమలుకు నోచుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం దృష్టి సారించి చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి కింది స్థాయి ఉద్యోగులను ఆదుకోవాలని కోరుతున్నారు.