RTC Buses For Medaram Sammakka Sarakka Jatara : మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహా జాతర ఇంకా ఇరవై రోజులు ఉండగానే పెద్ద సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. మేడారానికి వచ్చే మహిళల కోసమే ప్రత్యేకంగా మహాలక్ష్మీ పథకం కింద ఆరువేలకు పైగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. దాదాపు 40 లక్షల మేర ప్రయాణీకులు ఆర్టీసీని వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నట్లు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు.
Huge Devotees Rush at Medaram Jatara : ఇప్పటికే 85 వేల మంది భక్తులు బస్సుల ద్వారా మేడారానికి వెళ్లారని వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. మేడారం వెళ్లే బస్సులకు అధునాతన సాంకేతికత ద్వారా వెహికల్ ట్రాకింగ్ డివైజ్ను అమరుస్తున్నామని, దీని ద్వారా బస్సులు నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ సమయం తీసుకుంటే ఎక్కడ నిలిచిపోయాయో తమకు తెలుస్తుందన్నారు.
అలాగే బస్సులు మొరాయించిన సమయంలో కూడా వాటిని వెంటనే మీద బాగు చేయడం, ట్రాఫిక్కు ఆటంకం లేకుండా వాటిని తరలించేందుకు 12 రిలీఫ్ వ్యాన్లు, 2 క్రేన్లను సిద్ధంగా ఉంచుకుంటున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీలత తెలిపారు. మొత్తం 14 వేలకు పైగా అధికారులు సిబ్బంది మేడారం జాతర విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతామని చెప్పారు.
'మేడారం జాతరకు అన్నీ పనులు పూర్తి కావొచ్చింది. దాదాపు 80 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి. జాతరకు వచ్చే భక్తుల కోసం క్యూలైన్లు, మా సిబ్బంది కోసం రెస్ట్ రూమ్స్ నిర్మించాం. వాహనాల పార్కింగ్ కోసం కూడా స్థలాలను ఏర్పాటు చేశాం. మహాలక్ష్మీ పథకం అమలు కాకముందు 4 వేల బస్సులు అనుకున్నాం, ప్రస్తుత రద్దీకి అనుగుణంగా 6 వేల బస్సులను ఏర్పాటు చేశాం' - శ్రీలత, వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్
Sammakka Sarakka Jatara 2024 : మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంతమంతా జనసంద్రంగా మారుతోంది.
మినీ మేడారం అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర - ఈ విషయాలు తెలుసా?