CM Jagan Siddham Public Meeting: కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం జగన్ నిర్వహించిన మేమంతా సిద్దం బహిరంగసభకు ఆర్టీసీ బస్సులు భారీగా తరలించారు. విజయవాడ లోని అన్ని బస్ డిపోల నుంచి ఆర్టీసీ సిటీ బస్సులను గుడివాడకు తరలించారు. విజయవాడ నుంచి మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, గుంటూరు, నందిగామ తదితర ప్రాంతాలకు వెళ్లే పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులను సైతం రద్దు చేసి సీఎం సభకు బస్సులను తరలించారు.
సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక అష్టకష్టాలు పడ్డారు. విజయవాడ లో ఆస్పత్రిలో వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బస్సులు దొరక్క గంటల తరబడి పడిగాపులు పడ్డారు. చాలా సేపు నిరీక్షణ తర్వాత వచ్చే ఒక్కో బస్సు వస్తుండటంతో వాటిలో ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో వృద్దులు , వికలాంగులు ,ఆరోగ్యం సరిగా లేని రోగులు కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఇదే సమయంలో పలు ప్రాంతాలకు వెళ్లే వారు గత్యంతరం లేని పరిస్ధితుల్లో ఆటోలను ఆశ్రయించారు. డిమాండ్ ను అదనుగా చేసుకున్న ఆటోవాలాలు దోపిడీ చేస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. దీంతో ఎటూ వెళ్లలేక గంటల తరబడి బస్టాండ్లలో వేచిచూస్తున్నట్లు వాపోయారు. మరోవైపు యాత్ర వల్ల గన్నవరంలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. గాంధీ బొమ్మ సెంటరు లో అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది.
సీఎం జగన్ గుడివాడ పర్యటన నేపథ్యంలో గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కమిటీ ప్రధాన కార్యదర్శి బసవ అరుణను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. తాము నిరసన కార్యక్రమాలు చేయడం లేదని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని కమిటీ ప్రధాన కార్యదర్శి బసవ అరుణ వాపోయారు. పై నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం హౌస్ అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు పోలీసుల చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. జగన్ సిద్దం బస్ యాత్ర నేపథ్యంలో గన్నవరంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను మూసివేశారు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
వైఎస్సార్సీపీకి గుడ్‌బై- రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేనలో భారీగా చేరికలు - YCP JOINed JSP AND TDP
కేసరిపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్. జగన్ సమక్షంలో పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం, బీసీవై పార్టీలతో పాటు ప్రజాసంఘాల నుంచి కీలక నేతలు వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించిన చలసాని స్మిత(చలసాని పండు కుమార్తె), దేవినేని గౌతమ్ దంపతులు వైసీపీలో చేరారు. పెనుమలూరు నియోజకవర్గం బీసీవై పార్టీ నుంచి కె ఉమావల్లియాదవ్ వైసీపీలో చేరారు. మాదిగ హక్కుల కమిటీ పౌండర్ గురివిందపల్లి చిట్టిబాబు సైతం వైసీపీ తీర్తం పుచ్చుకున్నారు.