Roads Full Damaged Due to Heavy Rains in Telangana : వర్షాలకు ఉమ్మడి మెదక్ జిల్లా రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ప్రధానంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో దారులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేక వర్షపు నీరు బయటకి వెళ్లలేక రోడ్లపై నిలుస్తోంది. దీంతో రోడ్లు గుంతలుగా మారుతున్నాయి. మిరుదొడ్డి మండలం అల్వాల నుంచి సిద్దిపేటకు వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కసులాబాద్ మీదుగా చిట్టాపూర్కి వెళ్లే రహదారి పరిస్థితి కుడా ఇంతే. దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో పలు గ్రామాల్లోని మార్గాలు కంకర తేలి గుంతలమయంగా మారాయి.
రాత్రివేళల్లో ఇబ్బందులు : మెదక్ జిల్లాలోని పిల్లికోటల శివారులో వేయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. అందులో 500 మంది లబ్దిదారులకు ఇళ్లైయితే పంపిణీ చేశారు కానీ రోడ్లు వేయడం మాత్రం మరిచారు. మట్టి రోడ్లు ఉండటంతో చిన్నపాటి వర్షానికే నేల చిత్తడిగా మారుతోంది. రాత్రిపూట వెళ్లాలంటే కష్టంగా ఉందని గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. నర్సికేడ్, జేఎన్ రోడ్డు, వెంకట్రావు నగర్ కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఎడతెరిపి లేకుండా వానలు - వరద ఉద్ధృతికి మునిగిపోతున్న పంట పొలాలు - Rains impact In Telangana
రోడ్డంతా గుంతలమయం : పారిశ్రామిక వాడగా పేరొందిన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతాల్లో కూడా దారుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పటాన్‌చెరు నుంచి ఇంద్రేశం వెళ్లే రహదారి గుంతల మయంగా మారింది. తాజాగా ఈ ప్రాంతంలో వెంచర్లు అభివృద్ధి చెందడంతో వాహన రద్దీ పెరిగింది. దీంతో రోడ్లు మరింత ధ్వంసమవుతున్నాయి. సాయికాలనీ సమీపం బచ్చుగూడెం కూడలిలోనూ ఇలాగే ఉంది. రోడ్లను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
"వర్షాలు పడగానే ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతున్నాయి. రోడ్లు గుంతలు పడి ఉండడాన్ని అధికారులు చూసి పోతున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇండ్లు కురుస్తున్నాయి. సీసీ రోడ్డు మంజూరు అయింది అన్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. త్రాగునీరు సరిగ్గా రావడం లేదు. అధికారులు పట్టించుకుని రోడ్లు వేస్తే ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరగవు." - స్థానికులు
సంగారెడ్డి మండలంలో మారెపల్లి నుంచి సదాశివపేట వెళ్లే మార్గం దారుణంగా తయారైంది. మారేపల్లి, గంగారం, మందాపూర్‌తోపాటు పలు తండాల ప్రజలు ఇలానే ప్రయాణించాల్సి ఉంది. సదాశివపేట మార్కెట్‌కు కూడా ఇదే దారి కావడంతో ద్విచక్రవాహనాల ద్వారా తీసుకెళ్తున్న కూరగాయలు పలుమార్లు రోడ్లపాలవుతున్నాయి. ప్రధానంగా బడికెళ్లే పిల్లలు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు - వరదనీటిలో మునిగిన పంటలు - Rains Effects In Telangana