Road Accident in Kakinada District: పొట్ట కూటి కోసం కూలి పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. నవ మాసాలు మోసి కని పెంచిన తన ముగ్గురు కుమారులు తన కళ్లముందే విగత జీవులుగా రోడ్డుపై పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లి, మృతి చెందిన తన ముగ్గురు కుమారులను చూసి పడ్డ మానసిక క్షోభ హృదయ విదారకం.
ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి తీవ్ర గాయాలతో బయటపడగా, తన ముగ్గురు కుమారులను కోల్పోయిన హృదయ విదారక ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గండేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: భీమవరానికి చెందిన నంగలం దుర్గ (40) తల్లి, కుమారులు నంగలం రాజు (18), నంగలం యేసు (18), నగలం అఖిల్ (10) నర్సీపట్నంలోని కూలి పనులకు వెళ్లి ముగించుకొని వస్తున్నారు. ద్విచక్ర వాహనంపై నర్సీపట్నం నుంచి తమ సొంత గ్రామమైన భీమవరం మండలం తాడేరు గ్రామానికి వెళ్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గండేపల్లి మండలం మురారి గ్రామ శివారుకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో, వెనుక నుంచి వచ్చిన వాహనం వీరిపై నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో రాజు, ఏసు, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి దుర్గను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ తెలిపారు.
స్కూలుకు వెళ్తుండగా ప్రమాదం - ఇద్దరు చిన్నారులు మృతి - Two children died in road accident
గేదెలను తప్పించబోయి బస్సు బోల్తా- ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు - bus accident