YSRCP Govt Land Titling Act: వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం రాష్ట్రంలోనే అమలు చేయటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ చట్టం వల్ల భూములపై యజమాన్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి దౌర్జన్యంగా కాజేసిన ఆస్తులకు చట్టబద్ధత కల్పించుకునేందుకే వైఎస్సార్సీపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని స్వయంగా న్యాయ నిపుణులే చెప్తున్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని భూ కబ్జాదారులు అవలీలగా భూములను కొట్టేసేందుకు వీలుంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు సైతం రోడ్డెక్కి ఆందోళనల బాట పట్టినా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
కాగా వైఎస్సార్సీపీ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి తాను కూడా బాధితుడిని అంటూ ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి ముందుకొచ్చారు. తల్లిదండ్రుల భూములపై తనకు హక్కు లేకుండా చేస్తున్నారంటూ ఆయన వాపోయారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమంటూ పీవీ రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
"జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు నేనూ బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశకు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం." - పీవీ రమేశ్, విశ్రాంత ఐఏఎస్ అధికారి
రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై విమర్శలు వినిపిస్తున్నా అధికార పార్టీ నేతలు మాత్రం అది కేంద్రం సూచించిన చట్టం, మాదేం తప్పులేదన్నట్లు ఊదరగొడుతున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను విస్మరించి పౌరుల స్థిరాస్తులకు ఎసరు పెట్టేలా రూపొందిచారు. నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నమూనా టైటిలింగ్ చట్టం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన యాక్ట్‌ను పక్కన పెట్టుకుని అధ్యయనం చేస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.
విశ్రాంత ఐఏఎస్ అధికారి ట్వీట్‌పై చంద్రబాబు: ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై విశ్రాంత ఐఏఎస్ అధికారి చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించలేం అని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజల భూమి, ఇల్లు, స్థలం, పొలం అన్యాక్రాంతం అవుతుందని ట్వీట్ చేశారు.