Live: వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాట - తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం - LIVE FROM TIRUPATI
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : 13 hours ago
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు (51), విశాఖపట్నానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల (50)లుగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) అనే మహిళ మృతి చెందినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం.. తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. 9వ తేదీ (గురువారం) ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతోపాటు పొరుగునున్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో పోగయ్యారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో (జీవకోన, బైరాగిపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి) తొక్కిసలాట జరిగింది.