BMW Cars Missing Issue in AP : గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల ఆచూకీ ఏపీ ప్రభుత్వానికి తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది. వీటిలో ఒకటి 2017 నవంబరులో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేటాయించారు. అప్పట్లో ఆ పదవిలో అనంతరాము(ఐఏఎస్) ఉన్నారు. ఆతర్వాత ఆ బాధ్యతలను ప్రస్తుత ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ నిర్వర్తించారు. అయితే ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడుందో? ఎవరి వద్ద ఉందో? తెలియదని ఆ శాఖ అధికారుల చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో సమాచారం కూడా లేదు.
అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో, ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(PCCF) కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. మరోవైపు బీఎండబ్ల్యూ కారును కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి సతీమణి హైదరాబాద్‌లో వినియోగిస్తున్నట్లు అటవీశాఖ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నివేదిక కోరిన పవన్ కల్యాణ్ : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 414/2017కు సంబంధించిన కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి TN 05 BH 3303 నంబరు గల బీఎండబ్ల్యూ కారును అటవీ అధికారులు గతంలో సీజ్ చేశారు. ప్రభుత్వ స్వాధీనం (కాన్ఫిస్‌కేట్) కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబరు 11వ తేదీన అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేటాయించారు. ప్రస్తుతమున్న అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామ్ అప్పట్లో ఆ స్థానంలో విధులు నిర్వర్తించారు. 2019 జూన్ వరకూ అనంతరామ్ ఆ బాధ్యతల్లో కొనసాగారు.
అనంత రాము తర్వాత 2019 జూన్ నుంచి 2020 అక్టోబరు వరకూ, మళ్లీ 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకూ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. నీరబ్ కుమార్ తర్వాత మళ్లీ పాత అధికారి అనంతరాము ఆ పోస్టులో ప్రస్తుతం కొనసాగుతున్నారు.
వీరితో పాటు గతంలో సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మరో అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ కూడా కొంతకాలం ఈ అటవీ శాఖ విధుల్లో కొనసాగారు. అయితే ఆ బీఎండబ్ల్యూ కారు మాత్రం ఎక్కడ ఉందనే విషయం అధికారికంగా అటవీశాఖకు అసలు సమాచారమే లేదు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించడం గమనార్హం.
పత్తాలేని మరో BMW : పుత్తూరు అటవీ ప్రాంతం పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN 18 K 2277 నంబరు గల బీఎండబ్ల్యూ నీలీ రంగు వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించారు. ఆ కారు గురించి కూడా అటవీ అధికారులకు కూడా సమాచారం లేదు.
టోయోటా ఇన్నోవా కూడా : తమిళనాడుకు చెందిన స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న TN 07 CB 3724 టోయోటా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని 2023 జులైలో అప్పటి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు కేటాయించారు. అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.