Rare Fish Ramalu Specialties : పులస చేప తినడానికి మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడతారు. అదే స్థాయిలో రుచి అందించే రామ చేపలకు డిమాండ్ భారీగానే ఉంటుంది. చూడటానికేమో బొమ్మిడాయిల మాదిరిగా ఉండి పులస లాంటి రుచితో అదరగొడుతాయి ఈ రామలు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉప్పుటేరు పరీవాహక ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు నెలలు మాత్రమే దొరికే వీటి కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు. దీపావళికి ముందు నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ఇవి లభ్యమవుతాయి. ఐదారు అంగుళాల పొడవుండే ఈ రామల రుచి తెలిసినోళ్లు వీటి ధరను అస్సలు పట్టించుకోకుండా కొంటారు.
బొమ్మిడాయి అక్క దొరికేది కొన్ని ప్రాంతాల్లోనే : కార్ప్ అనే చేపజాతి కుటుంబానికి చెందిన ఈ చేప (రామలు) శాస్త్రీయ నామం లేబియో రోహితా. ఈ ప్రాంతంలో రామలుగా ప్రసిద్ధి చెందిన వీటిని రావలు, రావా, రావల చేపగానూ పిలుస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రతీరం ఎగువ ప్రాంతంలో ప్రవహించే ఉప్పుటేరులోకి యనమదుర్రు, గొంతేరు, బొండాడ తదితర కాలువలు కలిసే ప్రాంతాల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి సహజంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు దొరుకుతాయి.
పులస చెల్లి ధర అదిరిపోవాల్సిందే : ఇవి సగటున కిలోకు 40 వరకు తూగుతాయి. కానీ వీటిని కిలోల లెక్కన విక్రయించరు. ఒక్కొక్కటిగా అమ్ముతారు. రామల ధర సాధారణ రోజుల్లో ఒక్కోటి రూ.25 ఉంటుంది. దీపావళి ముందు రోజుల్లో అంటే సీజన్లో రూ.30పైనే పలుకుతుంది. కొన్నేళ్లుగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా భీమవరం మండలం లోసరి ప్రాంతంలో చెరువుల్లో ఈ చేపలను సాగు చేస్తున్నారు. మే నెలాఖరు నాటికి సీడు వేస్తారు. ఐదు నుంచి ఆరు నెలలపాటు వీటిని జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందంటున్నారు రైతులు. సీడు ఒక్కోటి గతంలో 25 పైసలు ఉండేదని, ఇప్పుడు రూ.3కు చేరిందని వ్యాపారి కె.ఏసు వివరించారు.
వర్షాలు తగ్గుముఖం పట్టి ఉప్పుటేరులో ప్రవాహ వేగం తగ్గిన తరువాత కాస్త ఉప్పు, చప్పటి నీరు కలిసి ఉండే ఏర్లలో ఇవి దొరుకుతాయి. సీజన్లో ఒక్కసారైనా రామలు తినాలంటూ మాంసాహారులు గొప్పలు పోతారు. అలాగని ఇదేదో చౌకగా లభించే చేప కాదు సుమా ఆ రుచి చూడాలంటే కాసులు కురిపించాల్సిందే.
"చీరమేను చిక్కిందిగా" - యానాం తీరంలో ఎన్నాళ్లకో ఇలా!
పులస అ'ధర'హో - రూ.24 వేలకు అమ్మిన గంగపుత్రుడు - pulasa fish sold for rs 24 thousand