Ramoji Rao Photo Exhibition At Vijayawada : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం విజయవాడ శివారు కానూరు వందడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, పాత్రికేయ దిగ్గజాలు ఎన్. రామ్, శేఖర్ గుప్తా తదితరులు హాజరుకానున్నారు.
మొత్తం 21 మంది అతిథులు వేదికపై ఆశీనులుకానుండగా సభకు హాజరయ్యేందుకు ప్రముఖులంతా తరలివస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరానికి మీడియా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వచ్చారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాఘవేంద్రరావు, రాజస్థాన్ పత్రికా ఎడిటర్ గులాబ్ కొఠారి సహా ఇతర అతిథులకు విమానాశ్రయంలో ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులు రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు. రామోజీరావు సంస్మరణ సభకు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తెలుగు జాతి కీర్తి శిఖరం రామోజీరావు - ఆయన విలువలూ విశ్వాసాలు మీకోసం - Ramoji Rao Success Story
రామోజీరావు స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. వీరి కోసం పెదపారుపూడి గ్రామానికి 3 బస్సులు, మండలానికి మరో 3 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు పది వేల మంది వరకు కుర్చునేందుకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. కానూరు రోడ్డులో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలీసులను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
సభ నిర్వహణలో భాగంగా రామోజీరావు జీవిత విశేషాలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. రామోజీరావు జీవితంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. సమాచారశాఖ మంత్రి పార్థసారధి, తెలుగుదేశం సీనియర్‌నేత కంభంపాటి రామ్మోహన్‌రావు దీనిని తిలకించి వారికి రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తికి తమ ప్రభుత్వం హయాంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని సమాచార శాఖ మంత్రి పార్థసారథి అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లును ఆయన పర్యవేక్షించారు.
నేడు ఏపీలో రామోజీరావు సంస్మరణ సభ - ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు - RAMOJI RAO MEMORIAL SERVICE IN AP