Ramoji Rao Memorial Meet : ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని ఆచరించినప్పుడే ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారని, ఆ కోవకు చెందిన వారే దివంగత రామోజీరావు అని ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసగీతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సామాన్యుడిగా పుట్టి అసమాన్యుడిగా ఎదగాలంటే, మన లక్ష్య సాధనకు కృషిచేస్తేనే సాధ్యమవుతుందని డీఎన్ ప్రసాద్ అన్నారు. ఈనాడు సంస్థల్లో పని చేసే ప్రతి ఉద్యోగి కూడా ఒక నిబద్ధతతో పనిచేస్తారని, దానికి రామోజీరావు జీవితమే మార్గనిర్దేశమని పేర్కొన్నారు. ఆయన చివరి నిమిషం వరకు శ్రమలోనే తమకు విశ్రాంతి అనే నినాదంతో పనిచేశారన్నారు. పనిని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తే వచ్చే ఫలితాలు కూడా తీయని ఫలాలను ఇస్తాయని రామోజీరావు నమ్ముతారన్నారు.
విద్యార్థులు కూడా రామోజీరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని డీఎన్ ప్రసాద్ సూచించారు. క్రమశిక్షణ, ప్రణాళిక, సమయపాలన.. రామోజీరావు నమ్మే సిద్ధాంతాలని, ప్రతిఒక్కరు ఈ మూడింటిని అలవర్చుకోవాలని, తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్మరణ సభకు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, రసగీతి సాహితీ సంస్థ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కళింగ కృష్ణకుమార్ పాల్గొన్నారు.
"ఉన్నతమైన ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని ఆచరించినప్పుడే ఉన్నతమైన వ్యక్తులుగా మారుతారు. ఆ కోవకు చెందిన వారే దివంగత రామోజీరావు. ఆయన చివరి నిమిషం వరకు శ్రమలోనే తమకు విశ్రాంతి అనే నినాదంతో పనిచేశారు. క్రమశిక్షణ, ప్రణాళిక, సమయపాలన.. రామోజీరావు నమ్మే సిద్ధాంతాలు. విద్యార్థులు రామోజీరావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి". - డీఎన్ ప్రసాద్, ఈనాడు తెలంగాణ సంపాదకుడు
అక్షర యోధుడికి పుష్పాంజలి - దేశవ్యాప్తంగా రామోజీరావుకు ఘన నివాళులు - tributes to ramojirao
విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు : ఎం. నాగేశ్వరరావు - Ramoji Rao condolence at Press Club