Ramoji Rao Grand Daughter Divija Interview : తాతయ్యగారు నన్ను ప్రేమగా దివిజమ్మ, నాన్నలూ అని పిలిచేవారు. నా జీవితంపై ఆయన ప్రభావం ఎక్కువ. నా చదువు విషయంలో ఎక్కువశాతం ఆయనే మార్గనిర్దేశం చేసేవారు. చిన్న విషయంలోనైనా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. నా ప్రతి పుట్టినరోజుకూ ఆయన ఎక్కువగా పుస్తకాలూ, నవలలే బహుమతులుగా ఇచ్చేవారు. తొమ్మిదేళ్లకే అమర్ చిత్ర కథ, పంచతంత్రం... లాంటి పుస్తకాలు నాకు పరిచయం చేశారు. కొంచెం పెద్దయ్యాక సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు ఇచ్చేవారు.
నా పదహారో పుట్టినరోజుకు కానుకగా బిజినెస్, ఫ్యామిలీ బిజినెస్ పుస్తకాలు ఇచ్చారు. ఒక్కోసారి ఆయన రూమ్‌లోకి నేరుగా వెళ్లిపోయి, కబోర్డులో ఉన్న పుస్తకాలు తీసుకుని చదివేసేదాన్ని. సందేహాలు వస్తే అడిగేదాన్ని. చాలా ఓపిగ్గా వివరించేవారు. అలా ఇప్పటివరకూ 2వేల పుస్తకాల దాకా చదివాను. వాటిలో ఎక్కువ తాతయ్య ఇచ్చినవే. పనిలోనే విశ్రాంతి అనే ఆయన కుటుంబానికీ చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఎంత బిజీగా ఉన్నా, ఆయన క్యాబిన్‌లోకి వెళ్తే, అన్నీ పక్కనపెట్టి నాతో సమయం గడిపేవారు. అదే ఆయన నాపై ప్రేమను వ్యక్తపరిచే తీరు. అదేకాదు, నాకు ఏ చిన్న సమస్య వచ్చినా తాతగారి దగ్గరికే వెళ్లేదాన్ని. చాలా సున్నితంగా వ్యవహరించేవారు. నా సమస్యలే ఆయన సమస్యలన్నట్లు భావించి పరిష్కరించేవారు. ఈ 17ఏళ్లలో నన్ను ఒక్కసారి కూడా కోప్పడిన సందర్భం లేదు.
తాతయ్యను తెల్ల వస్త్రాలే ఎందుకు వెసుకుంటారని అడిగా : ఏదైనా తప్పు చేస్తే అది ఎందుకు తప్పో, సరైన మార్గం ఏంటో నొప్పించకుండా, ప్రేమతో చెప్పేవారు. ఇంట్లో చిన్నదాన్ని కదా! గారాబమూ ఎక్కువే! చిన్నప్పుడు నేను ఆయన్ను ఒక ప్రశ్న అడిగా. ఎప్పుడూ ఈ తెల్లబట్టలే ఎందుకు వేసుకుంటారు? మీకు బోర్ కొట్టదా తాతయ్యా అని అప్పుడు ఆయన ‘నాన్నా తెలుపంటే స్వచ్ఛతకు ప్రతిరూపం. చేసేపని పట్ల కూడా మనం అంతే స్వచ్ఛంగా ఉండాలనేదానికి చిహ్నంగా ఇవి వేసుకుంటా’ అని చెప్పారు. ఖరీదైన బట్టలు, చెప్పులు లాంటివి వేసుకోరు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన వాడే పెన్ కూడా 30 రూపాయలే. చదువుల గురించే కాదు... మా ఆరోగ్యం గురించీ అనేక జాగ్రత్తలు చెప్పేవారు. యోగా, ధ్యానం చేయమనేవారు. రోజూ ‘ఈనాడు’ నుంచి ఆహారానికి సంబంధించిన క్లిప్పింగ్స్ మాకు పంపించి ఏ ఆహారం మంచిదీ, ఏ సీజన్‌లో ఏం తినాలి? అనేది చదవమనేవారు.
ఇక ఈ దీవేనని జీవితంలో వినలేను : జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఎంత స్థితప్రజ్ఞతతో మెలగాలో నేర్పేవారు. త్వరలో అమెరికాలో రైటింగ్, బిజినెస్ చదవబోతున్నా. కోర్సు అయ్యాక ఫిలింమేకింగ్, ఓటీటీ రంగాల్లో పనిచేయాలనుకుంటున్నా. నా ఆసక్తిని గమనించిన తాతయ్య దానికి సంబంధించిన అనేక విషయాలు నాతో పంచుకునేవారు. ‘నువ్వు అచ్చం తాతగారి పోలికే’ అని అమ్మ ఎప్పుడూ అంటుంటారు. నా నడక, మాటతీరు అన్నీ ఆయన గుణాలే వచ్చాయంటారందరూ. నాకు పేరు పెట్టిందీ తాతగారే నన్ను ఎప్పుడూ విజయీభవ అని దీవించేవారు కాదు. ‘దివిజయ్‌భవా దిగ్విజయీ భవా..’ అని దీవించేవారు. ఆయన ఒక్కరే అలా దీవించేవారు. ఇక ఆ దీవెనని మళ్లీ జీవితంలో ఎప్పుడూ వినలేను.
ప్రతిదశలోనూ నాచేయి పట్టుకుని నడిపించిన తాతయ్య ఇక లేరు రారు అనే ఆలోచనే చాలా బాధాకరంగా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక తాతయ్యను అడిగాను ఏదిఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్యా! అని. అప్పుడు ఆయన ‘ధర్మం ఊరికే గెలవదు. దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలి. ఎంతోమంది త్యాగాలు చేయాలి’ అని చెప్పారు. అవే ఆయన నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. కడవరకూ నిజాయతీగా, ప్రజల మంచికోసం పోరాడిన ఆయన తత్వం, క్రమశిక్షణలే నాకు స్ఫూర్తి. ఆయన చేసిన మంచిలో నేను పదిశాతం చేయగలిగినా చాలు. అదే నాకు సంతృప్తి!