Ramoji Rao Final Rites Journey : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానాలు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీఫిల్మ్‌సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఆ తర్వాత రామోజీరావు పార్థివదేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివదేహం ఇంటి నుంచి కదలి వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అక్షర సూరీడి అఖరిప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషణ్ణ వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులు అర్పించారు. ఛైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు.
పాడె మోసిన చంద్రబాబు : రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్‌సిటీ ఆవరణలోని స్మృతివనం వరకూ దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసే రామోజీ గ్రూపు ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్యసాధకుడికి కన్నీటివీడ్కోలు పలికారు. అశ్రు నయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, రామోజీరావు పాడె మోశారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ సహా గ్రూప్ ఉన్నతోద్యోగులు పాడెమోశారు.
అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజత్ భార్గవ, ఆర్పీ సిసోదియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగుజాతి ముద్దు బిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం రామోజీరావు భౌతిక కాయాన్ని చితిపైకి చేర్చారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు.
ప్రముఖుల నివాళి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క సహా పలువురు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లు అర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
అస్తమించిన అసామాన్యుడు - దివికేగిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు - RAMOJI RAO PASSED AWAY