Ramoji Group Employees Tribute to Ramoji Rao : జననమూ, మరణమూ ప్రతి మనిషి జీవితంలో సాధారణ విషయాలే. కానీ అతి కొద్దిమంది మాత్రమే, తరతరాల పాటు తమ ముద్రను శాశ్వతంగా వేయగలుగుతారు. వారిలో ఒకరు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు. అక్షర యోధుడు రామోజీరావు అక్షరాలనే లక్షణాలుగా మలచి లక్షలాది మందికి ఉపాధి కల్పించారు. రాష్ట్రంలో పలుచోట్ల రామోజీ సంస్మరణ సభలు నిర్వహించారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు ఉషోదయంతో ఊపిరులూదారని వక్తలు ప్రశంసించారు. గురువారం రోజు దేశం అంతటా రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు.
రామోజీరావు కార్యదక్షత : రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు శ్రీకాకుళం ఈనాడు యూనిట్ ఆఫీస్‌లో ఉద్యోగులు నివాళులు అర్పించారు. సంస్మరణ సభలో రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈనాడు యూనిట్‌లో ఉద్యోగులు రామోజీరావు కార్యదక్షతను గుర్తు చేసుకున్నారు. సిబ్బంది పట్ల ఆయనకు ఉన్న అంకిత భావాన్ని కొనియాడారు.
జర్నలిజంలో విలువలు కాపాడిన అక్షరయోధుడు : విజయవాడ గూడవల్లి ఈనాడు యూనిట్‌లో మీడియా మొఘల్ రామోజీరావుకు ఉద్యోగులు నివాళులర్పించారు. జర్నలిజంలో విలువలు కాపాడిన అక్షరయోధుడని స్మరించుకున్నారు. లబ్బిపేట మార్గదర్శి కార్యాలయంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో మార్గదర్శి, కళాంజలి సిబ్బందితో పాటు ప్రముఖులూ పాల్గొన్నారు. లక్షల మందికి రామోజీరావు ఉపాధి కల్పించారని కొనియాడారు.
మార్గదర్శి కార్యాలయాల్లో శ్రద్ధాంజలి : గుంటూరు మార్కెట్ సెంటర్‌లోని మార్గదర్శి కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఛైర్మన్ స్ఫూర్తితో నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తామని ప్రతిన పూనారు. కొందరు ఖాతాదారులూ మార్గదర్శితో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. నెల్లూరు ఈనాడు యూనిట్‌లో జరిగిన రామోజీరావు సంస్మరణ సభలో జిల్లా రిపోర్టర్లు, సంస్థ ఉద్యోగులు పాల్గొని మౌనం పాటించారు. రామోజీరావు నిబద్ధత, క్రమశిక్షణ, నిజాయతీగా వ్యాపారాలను నడిపిన తీరును గుర్తు చేసుకున్నారు. నర్తకీ సెంటర్, వేదాయపాలెం మార్గదర్శి కార్యాలయాల్లో సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు.
'రామోజీరావు సేవలు చిరస్మరణీయం'- అక్షర యోధుడికి ఉద్యోగుల నివాళులు - Homage To Ramoji Rao
రెండు నిమిషాలు మౌనం : చిత్తూరు ఈనాడు యూనిట్‌లో సీనియర్ ఉద్యోగులు దశాబ్దాలుగా సంస్థతో, రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఛైర్మన్ ఆశయాలు, ముందుకు తీసుకెళ్తామన్నారు. అనంతపురంలోని మార్గదర్శి కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. కడప మార్గదర్శి కార్యాలయంలో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కడప ఈనాడు యూనిట్‌లోనూ ఈటీవీ,ఈనాడు సిబ్బంది సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. రామోజీరావు బాటలో నడుస్తామని ఉద్యోగులు ప్రతినబూనారు.