Ramayapatnam Church 150 Years Old: నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నం తీరంలో సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించిన చర్చి నాటి చరిత్రకు ఆనవాలుగా నిలుస్తోంది. 100 అడుగుల ఎత్తులో సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో రామాయపట్నంలోని ఓడరేవు ఎక్స్పోర్ట్స్కి కీలకంగా ఉండేది. ఆ క్రమంలో నాటి బ్రిటీష్ పాలకులు, అధికారులు ఈ ఓడురేవు ద్వారా రాకపోకలు సాగించేవారు.
దాంతో తీరంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో భారీ చర్చి నిర్మించారు. 30 సంవత్సరాల క్రితం వరకు చర్చి కాంపౌండ్‌లో హాస్పిటల్, స్కూల్, నర్సింగ్ స్కూల్ నడిపేవారు. కాలక్రమంలో ఆదరణ తగ్గడంతో స్కూల్ మాత్రమే నిర్వహిస్తున్నారు. చర్చిలో బైబిల్ ట్రైనింగ్ క్లాస్లు జరుగుతుంటాయి. కందుకూరు, కావలి ప్రాంతాల వారు సముద్ర తీరానికి వస్తే తప్పకుండా చూసే ప్రాంతం ఈ చర్చి ప్రాంగణం.
తెలంగాణలో 166 ఏళ్ల క్రితం: మరోవైపు తెలంగాణ రాష్ట్రం మెదక్‌లో 166 ఏళ్ల క్రితం నిర్మించిన చర్చి ఉంది. మామూలుగా మెదక్‌లో కేథడ్రల్ చర్చి ఆసియా ఖండానికే తలమానికంగా భాసిల్లుతోంది. అయితే ఇది మెదక్‌లో నిర్మించిన మొదటి చర్చి కాదు. దీనికంటే అనేక సంవత్సరాల క్రితమే మరొకటి నిర్మితమైంది. అదే పాత చర్చిగా పిలిచే ఛాపెల్ చర్చి. నేటి వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ పాత చర్చిని మతబోధకుడు బర్గీస్ దొర దాదాపు 166 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇందుకోసం కేవలం రాళ్లు, మట్టిని మాత్రమే దీని నిర్మాణంలో వినియోగించారు.
పైకప్పును గడ్డి, మోదుగ ఆకులతో కప్పారు. దీని నిర్మాణానికి అప్పట్లో కేవలం 375 రూపాయలు మాత్రమే ఖర్చయింది. సికింద్రాబాద్ తిరుమలగిరి చర్చిలో పనిచేస్తున్న ఛార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1897వ సంవత్సరంలో మెదక్ చర్చికి ప్రచారకుడిగా బదిలీ అయి వచ్చారు. అనంతరం ఈయనే ఈ చర్చికి కేథడ్రల్ రూపకర్త అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లేని నాటి కాలంలోనే మెదక్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందాయి. 1870-80 మధ్యకాలంలో ‘మిషన్ హాస్పిటల్’ మెదక్‌లో ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్సల కోసం డాక్టర్లు ఇంగ్లండు నుంచి వచ్చి చేసేవారు.
మెదక్‌లో కెథడ్రల్ చర్చికంటే పాతది ఇదే - 375 రూపాయలతో నిర్మాణం