Ramadan 2024 Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్ధలతో మసీలు, ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆయణ్ను మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ శుభాకాంక్షలను(Ramadan Wishes) తెలియజేశారు. ముఖ్యమంత్రికి షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి ఇంట్లోనే రేవంత్ అల్పాహారం సేవించారు. సీఎంతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. పండగ వేళ సీఎం తన రావడం సంతోషకరంగా ఉందని షబ్బీర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.
రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లోని మీర్ ఆలం ఈద్గా, చార్మినార్, మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ఉన్న మసీదులో పెద్ద సంఖ్యలో వచ్చిన ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే హైదరాబాద్ సనత్‌నగర్‌లోని వెల్ఫేర్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకలకు(Ramadan Celebrations 2024) మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు చోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదిలాబాద్‌లోని ఈద్గా మైదానంలో జిల్లా ఎస్పీ ఆలం గౌస్ సామాన్యుడిలా అందరితో కలిసి ప్రార్థనలు చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ తదితరులు ముస్లింలను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
"ఈ రంజాన్ మాసం 30 దినాల్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా చిన్న గొడవ అనేది జరగలేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు. ఉదయం 5 గంటల వరకు షాపులు అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో షాపులు అర్ధరాత్రి 2 వరకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందుకు మరో 3 గంటలు ఎక్స్ట్రా టైమ్ అనేది ఇచ్చాము. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." - షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారుడు
రంజాన్ వేళ కిక్కిరిసిపోతున్న డ్రై ఫ్రూట్ మార్కెట్లు - ఏడాది గిరాకీ నెల రోజుల్లోనే!
గవర్నర్ శుభాకాంక్షలు : ప్రపంచ శాంతిని, ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు : మానవసేవ అత్యున్నతమైనదని చాటిచెప్పే రంజాన్ పండగ లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వంద రోజుల్లోనే పాతబస్తీలో మెట్రో రైలు లైన్ శంకుస్థాపన చేశామన్నారు. మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచామని తెలిపారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపముఖ్యమంత్రితో పాటు మంత్రులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు : ముస్లింలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు జరిగిన ఉపవాస దీక్షలు ఆధ్యాత్మిక వాతావరణం నింపాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. ఆనందంగా ముస్లిం సోదరులు రంజాన్‌ను జరుపుకోవాలని హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు కోరారు.
రంజాన్ స్పెషల్స్ : "షీర్ ఖుర్మా" నుంచి "బాబా గణౌష్" దాకా! - అద్దిరిపోయే వీగన్ వంటకాలు!
అనార్కలీ టు షరారా - రంజాన్ పండుగకు మీరు ఈ లుక్స్ ట్రై చేసి చూడండి!