Rajanna Sircilla Youth Trapped in Cambodia : ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఆ దేశంలో ఉన్న చైనా కంపెనీ యువకులతో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
Cambodia Cyber Scam : శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల పురపాలక సంఘం పరిధి పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు అతికం శివ ప్రసాద్ కంబోడియాలో ఇబ్బంది పడుతున్నాడంటూ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్పీ వెల్లడించారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్ అనే ఏజెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి, రూ.1.40 లక్షలు తీసుకుని శివ ప్రసాద్‌ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వాట్సప్‌లో శివప్రసాద్‌తో మాట్లాడామని చెప్పారు. అక్కడున్న చైనా దేశానికి చెందిన కంపెనీ కాల్ సెంటర్‌లో ఆయన పనిచేస్తున్నట్లు, కంపెనీ నిర్వాహకులు భారతీయుల ఫోన్ నంబర్లు ఇచ్చి లాటరీ, ఉద్యోగాల పేరుతో అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో డబ్బు దోచేసేలా తర్ఫీదు ఇచ్చారని మాకు తెలిపారు. అతనిలాగే 500-600 మంది బాధితులు అందులో పనిచేస్తున్నారని, అందరితో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని శివ ప్రసాద్ చెప్పారని అఖిల్ మహాజన్ వివరించారు.
భాదితులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు : ఇదే విషయమై కంబోడియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చామని అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. అక్కడి పోలీసుల సహకారంతో శివ ప్రసాద్‌ను కాపాడామని తెలిపారు. రెండు రోజుల్లో ఆయన భారత్‌కు చేరుకుంటారని ఆయనతోపాటు అక్కడ ఉన్న బాధితులందర్నీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నామని అఖిల్ మహాజన్ వివరించారు.
రూ.10,000ల కమీషన్ కోసం అక్రమాలు : ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాగా ఓ ముఠా కమీషన్ల కోసం యువకులను మభ్యపెట్టి అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్న వైనం విచారణలో వెలుగులోకి వచ్చిందని అఖిల్ మహాజన్ వివరించారు. అతికం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. అతను రూ.10,000లు కమీషన్ తీసుకొని శివ ప్రసాద్‌ను లక్నోకు చెందిన సదాకత్ (ప్రస్తుతం సదాకత్ మాల్దీవులులో ఉన్నాడు) వద్దకు పంపినట్టు ఎస్పీ వెల్లడించారు.
సదాకత్ మరో రూ.10,000లు కమీషన్ తీసుకొని పుణెలో ఉన్న అబిద్ అన్సారీ వద్దకు శివ ప్రసాద్ పంపించినట్టు అఖిల్ మహాజన్ వివరించారు. ఆయన బిహార్ రాష్ట్రానికి చెందిన షాదల్ (ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు) వద్దకు పంపగా, అతను శివ ప్రసాద్‌ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నామని చెప్పారు. కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్ట్ చేశామని, పుణెలో ఉన్న అబిద్ అన్సారీని విచారించి నోటీసు ఇచ్చి పంపించామని అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
ఆన్లైన్ షాపింగ్ తెగ చేస్తుంటారా? ఈ టిప్స్ ఫాలో అయితే మీరెప్పుడూ సేఫ్! - Online Safe Shopping Tips