Whistle Removed From a Boy Lungs : ఈల ఊదుతూ ఆటలాడుకుంటున్న నాలుగున్నరేళ్ల బాలుడు పొరబాటున దాన్నే మింగేశాడు. అది కాస్త ఊపిరితిత్తిలోకి చేరడంతో ఊపిరాడక సతమతమయ్యాడు. గమనించిన ఆ చిన్నారి తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు చికిత్స చేసి ఈలను బయటకు తీశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన రాజు వ్యవసాయ కూలీగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అతని కుమారుడు ఐజక్‌కు నాలుగున్నరేళ్ల వయసు. అయితే మంగళవారం ఇంటి వద్ద ఆ బాలుడు ఈల ఊదుతూ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గట్టిగా ఊపిరి పీల్చేటప్పుడు ప్రమాదవశాత్తూ నోటిలో ఉన్న ఈల కాస్తా గొంతు ద్వారా ఊపిరితిత్తిలోకి వెళ్లిపోయింది.
కుడివైపు ఊపిరితిత్తిలో ఈల : అనంతరం బాలుడికి నిరంతరాయంగా దగ్గు వస్తుండటం, శ్వాస తీసుకోవడం కష్టమవడాన్ని తండ్రి రాజు గమనించాడు. ఐజక్‌ను హుటాహుటిన తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం బాలుణ్ని ఎక్స్రే ద్వారా పరీక్షించిన చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వెంకటేశ్ బాలుడి కుడివైపు ఊపిరితిత్తిలో ఈల ఉన్నట్లు గుర్తించారు. వెంటనే బ్రాంకోస్కోపీ ద్వారా బయటకు తీశారు.
ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నాడని మీడియా సమావేశంలో వైద్యుడు వెంకటేశ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కుపోయిన ఈలను బయటకు తీయడం చాలా క్లిష్టమైందని అన్నారు. అక్కడ చాలా సున్నిత భాగాలు ఉండటంతో చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందని చెప్పారు. తమ బృందం సమష్టి కృషితోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.
గుంటూరులో అరుదైన చికిత్స- ఇన్ ఫెక్షన్ సోకిన వ్యక్తికి పశువు రక్తనాళం
దేశంలో అరుదైన వ్యాధి విజృంభణ- వారంలోనే 100 మందికి వ్యాప్తి! లక్షణాలు, కారణాలు ఏంటి?