Rajamma Tanda Healthiest Village in Telangana : ఆధునిక కాలంలో కాలుష్య వాతావరణంలో కల్తీ ఆహారం తీసుకుంటూ నిత్యం రోగాలతో మనిషి సహవాసం చేస్తున్నాడు. కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ పల్లె మాత్రం ప్రకృతి జీవనాన్ని గుర్తు చేస్తోంది. కాలుష్యానికి, వ్యాధులకు దూరంగా పచ్చని ఒడిలో జీవిస్తోంది. కరోనా రెండు దశల్లోనూ ఒక్కరికి కూడా సోకలేదంటే ఆ తండా వాసుల జీవన శైలి అర్థం చేసుకోవచ్చు. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. తండాలో ఆయు ప్రమాణం 90 ఏళ్ల పైమాటే అంటే ఆశ్చర్యపోవద్దు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రాజమ్మతాండ ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ఇక్కడి ప్రజలు ఆయు ప్రమాణాన్ని పెంచుకోవడమే కాదు ఆస్పత్రులకూ దూరంగా ఉంటున్నారు. సహజ సిద్ద వాతావరణంలో జీవించడం వల్ల వారికి ఎలాంటి రోగాలు రావు. రాజమ్మతండాలో 30 ఇళ్లు వంద వరకు జనాభా ఉంటుంది. పచ్చని ప్రకృతి మద్య జీవించే వీరి జీవనోపాధి వ్యవసాయం.
3500 మంది రైతులకు శిక్షణ.. 200 రకాల విత్తనాల ఉత్పత్తి.. అందుకే 'ఆమె'కు పద్మశ్రీ!
Healthy Village Rajamma Tanda in Kamareddy : ఈ తండాలో 30 ఏళ్లుగా ఏడుగురు మాత్రమే మృతి చెందారు. 90 ఏళ్ల పైబడి ఉన్నవారూ వ్యవసాయం చేస్తూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వంటలు కట్టెల పొయ్యిపైనే చేస్తారు. ప్రధాన ఆహారం మక్క రొట్టె, వెల్లుల్లి కారం. ఏ ఇంట్లో కూడా రొట్టె లేకుండా ఒక్క పూట కూడా గడవదని తాండ వాసులు చెబుతున్నారు. పొలాల్లో పండించిన తాజా కూరగాయలను మాత్రమే వాడతారు.
"సేంద్రీయ ఎరువుల ద్వారా పంటలు పండిస్తాం. అన్నం కంటే ఎక్కువగా కట్టెల పొయ్యి మీద చేసిన మక్క రొట్టెలు తింటాం. కరోనా సమయంలో తండాలో ఒక్కరికి కూడా వైరస్ సోకలేదు. ఇక్కడున్నవారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కూరగాయలను పండించుకుంటాం. రోజూ వ్యవసాయ పనులు చేస్తాం. ఇంటి చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. మా చుట్టూ ఉన్న వాతావరణమే మాకు రక్ష ." -గ్రామస్థులు
Special Story on Rajamma Tanda Village : రాజమ్మతండా మిగతా తండాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడి ఇళ్లలో టీవీ, ఫోన్ తప్ప ఇతర ఎలక్ట్రిక్ వస్తువులు ఉండవు. ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వంటివి కనిపించవు. తాండకు సమీపంలోనే వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆ నీరు తాగరు. ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ రాజమ్మ తాండ దరిచేరలేదు. ప్రకృతితో మమేమకై కాలుష్యానికి దూరంగా ఎలా జీవించాలో రాజమ్మతాండ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.
'మొక్కలు పెంచడమంటే నాకు ప్రాణం - ఆ ఆలోచనే నన్ను సేంద్రీయ వ్యవసాయంవైపు అడుగులు వేయించింది'