Rain Alert in Telangana : గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. సోమవారం నుంచి రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. అయితే నేడు, రేపు ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, అలాగే ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జగిత్యాల జిల్లా అల్లీపూర్, కరీంనగర్ జిల్లా వీణవంకలో అత్యధికంగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం 26 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
శుక్రవారం హైదరాబాద్‌లో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని శనివారం, ఆదివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామని, అలాగే సోమవారం నుంచి ఎల్లో అలర్ట్ వస్తుందని వాతావరణ శాఖ తెలిపిరంది. మే 7, 8 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించామని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా ఎవరు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒకవైపు పెరిగిన ఈ ఎండలతో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఎండ వేడి నుంచి రక్షణ పొందేందుకు చల్లని వస్తువులు సేవిస్తే మంచిది. కొబ్బరి బొండాం, మంచినీళ్లు, మజ్జిగ, లస్సీ వంటి పానీయాలు సేవిస్తే ఎండ దెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు.
అత్యధికం ఉష్ణోగ్రతలు జగిత్యాల జిల్లా : అత్యధికంగా జగిత్యాల జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ఈ జిల్లాలో గత రెండు రోజులుగా 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. శనివారం కూడా ఉదయం నుంచే ఉక్కపోతతో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఎండ తాకిడికి రహదారులు బోసిపోతున్నాయి. అత్యవసరం ఉంటే తప్ప జనం బయటకు రావటం లేదు. చిన్న పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు.
మరోవైపు కరీంనగర్‌లో కూడా జగిత్యాలతో పాటే శనివారం ఉష్ణోగ్రత 46.8 డిగ్రీలుగా ఉంది. దీంతో పాటు నల్గొండ జిల్లాలో 46.7 డిగ్రీలు, నారాయణపేట 46.4 డిగ్రీలు, నిజామాబాద్ 46.4 డిగ్రీలు, పెద్దపల్లిలో 46.1 డిగ్రీ, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో 45.9 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.