Rain Alert to AP : బంగాళాఖాతంలో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కి తుపాన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం అక్టోబరులో నైరుతి రుతుపవనాలు తిరోగమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాల ప్రవేశించే సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఇటువంటి సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, అవి క్రమేపీ వాయుగుండాలు, తుపాన్లుగా మారతాయి. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఇది తీవ్ర వాయుగుండం, తర్వాత తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత పదేళ్లలో అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఏపీలోనే తీరం దాటాయి.
మరోసారి కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం నెలకొన్న ప్రాంతం నుంచి చెన్నై తీరం వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. వీటి ప్రభావంతో ఒక్కసారిగా తీవ్రత పెరిగే ప్రమాదముందని తెలుస్తోంది. మరోవైపు అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. అక్కడి నుంచి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం వరకూ ద్రోణి కొనసాగుతుంది. సెప్టెంబరు నెలలో ఇదే విధంగా బంగాళాఖాతంలో వాయుగుండం, అరేబియా సముద్రంపై కదులుతున్న తుపాను ప్రభావంతో రుతుపవన ద్రోణి ఏర్పడి విజయవాడ నగరంలో కుంభవృష్టి కురిసింది. మరోసారి అదే విధంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు: "ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండల్లా మారాయి. వాయుగుండం, తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల ఒక రోజులో 15 నుంచి 20 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశముంది. ఇటీవల విజయవాడలో నెలకొన్న పరిస్థితి పునరావృతం కాకుండా ఇప్పటినుంచే అంతా అప్రమత్తం కావాలి. కాలువలు, వంకలు, వాగులు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నాయో వాటిని పరిశీలించి పటిష్ఠం చేసుకోవాలి. కొద్దిరోజుల్లో వరి పంట చేతికి రానున్న నేపథ్యంలో అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి". - డా.కేజే రమేష్, మాజీ డీజీ, భారత వాతావరణశాఖ
అక్టోబరు-డిసెంబరు మధ్యలో ఏపీపై ప్రభావం చూపిన కొన్ని తుపాన్లు:
సంవత్సరం | తీరం దాటిన ప్రాంతం | ప్రభావితమైన జిల్లాలు |
2014 అక్టోబరు (హుద్ హుద్) | విశాఖపట్నం | విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం |
2016 డిసెంబరు (వార్దా) | చెన్నై సమీపంలో | నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప |
2018 అక్టోబరు (తిత్లీ) | పలాస సమీపంలో | శ్రీకాకుళం, విజయనగరం |
2018 డిసెంబరు (పెతాయ్) | కాకినాడ సమీపంలో | కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి |
2021 సెప్టెంబరు (గులాబ్) | కళింగపట్నం | విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం |
2022 డిసెంబరు (మాండౌస్) | మహాబలిపురం సమీపంలో | చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్ |
2023 డిసెంబరు (మిచౌంగ్) | బాపట్ల | చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు |