Dussehra Festival Rush : దసరా పండుగకు పట్నం జనం పల్లెబాట పట్టారు. హైదరాబాద్ మహానగరం క్రమంగా ఖాళీ అవుతోంది. లక్షల సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. అవసరమైతే రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరిన్ని అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు. పిల్లాపాపలతో ఊరెళ్లాలంటే గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు.
తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరాకు ప్రజలు సొంతూళ్లకు వెళుతున్నారు. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు కుటుంబంతో కలిసి తరలివెళుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే 1,400 పైచిలుకు, ఆర్టీసీ 6,300 ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నాయి. ప్రత్యేక బస్సుల్లో సుమారు మూడు లక్షలకు పైగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు క్షేమంగా చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపిస్తున్నామంటున్న యంత్రాంగం, 13, 14 తేదీల్లో తిరుగు ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు.
"ఈ దసరా పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతోంది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబరు 9వ తేదీ వరకు సుమారు 5260 బస్సులను నడిపాము. రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ఈ స్పెషల్ బస్సులను నడిపిస్తున్నాము. 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ఎక్కువగా హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాలకు తరలివెళ్లారు. ఎక్కడ కూడా రద్దీ లేకుండా బస్సు షెల్టర్లను ఏర్పాటు చేశాం. మళ్లీ తిరుగు ప్రయాణం అక్టోబరు 13 లేదా 14 నుంచి ఉంటుందని అనుకుంటున్నాం. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నాము." - శ్రీలత, ఆర్టీసీ రీజినల్ మేనేజర్
ప్రయాణికులకు తప్పని తిప్పలు : ఆర్టీసీ అధికారులు అదనపు సర్వీసులు పెంచినా, క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. స్పెషల్ బస్సుల్లో ఎక్కువగా రిజర్వేషన్లు ఉండటం వల్ల సీట్లు దొరకడం లేదని సామాన్య జనం వాపోతున్నారు. గంటల కొద్దీ రోడ్లపై కుటుంబంతో సహా పడిగాపులు కాసినా లాభం లేకుండా పోతోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్లు లేని బస్సుల సంఖ్యను పండుగ రద్దీ దృష్ట్యా మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రత్యేక రైళ్లు : దసరా, దీపావళి రద్దీ దృష్ట్యా అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి లక్షలాదిగా జనం తరలివెళ్తున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదనపు బుకింగ్ కౌంటర్ల ఏర్పాటు సహా ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్, అన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
దసరా ఎఫెక్ట్ - రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు ఫుల్ రద్దీ - RAILWAY STATION and bus stands RUSH
ఆ రూట్లలో వెళ్లేవారికి 'హ్యాపీ జర్నీ' - 644 'దసరా స్పెషల్' ట్రైన్స్ - railway stations rush