Railway Bridges Works in Nizamabad District : నిజామాబాద్ జిల్లాలో రైలు నెట్‌వర్క్ విస్తృతంగా ఉంది. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వైపు, నిజామాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు రైళ్ల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో జిల్లాలో చాలా చోట్ల రైల్వే గేట్‌లు ఉన్నాయి. ప్రధాన రహదారులపై ఉన్న వీటితో ప్రయాణికులు దశాబ్దాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో మాధవనగర్ (Madhavnagar Railway Over Bridge) వద్ద ప్రధాన రహదారిపై రైల్వే గేట్ ఉంది. నిజామాబాద్‌కు రాకపోకలకు ఇదే ప్రధానం మార్గం.
ఎట్టకేలకు బ్రిడ్జి పనులు ప్రారంభం.. ఇందూరు వాసుల ఇబ్బందులకు చెక్
ROB Works in Nizamabad : అలాగే, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్లే మార్గంలో మామిడిపల్లి, గోవింద్‌పేట్ రైల్వే గేట్‌లు ఉన్నాయి. అలాగే, మాక్లూర్ మండలం మామిడిపల్లి, నగర శివారులోని అర్సపల్లి, జానకంపేట వద్ద ఉన్నాయి. ఈ ఏడింటిలో ఆరు చోట్ల ఆర్వోబీలు, ఒక చోట ఆర్‌యూబీ మంజూరయ్యాయి. ఐదేళ్ల ముందు వరకు నిజామాబాద్ జిల్లాలో ఆర్వోబీలను పరిశీలిస్తే నగరంలోని గంజ్ ప్రాంతంలో మాత్రమే ఒకే ఒకటి ఉండేది. అయితే 2019లో ధర్మపురి అర్వింద్ లోక్‌సభకు ఎన్నికైన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న గోవింద్‌పేట్ ఆర్వోబీ (ROB Works in Nizamabad) ఏడాది క్రితం పనులు పూర్తికాగా ఇప్పటికే వినియోగంలోకి వచ్చింది. అదేవిధంగా, ఆర్మూర్ మండలం మామిడిపల్లి వద్ద జాతీయ రహదారి 63పై ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి మరో నెల రోజుల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మూడు నెలల కింద అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, నెలన్నర కింద బోధన్ ఆర్వోబీ, నవీపేట -జానకంపేట మధ్య ఆర్‌యూబీ పనులు ప్రారంభమయ్యాయి.
Devarakadra Railway Gate : రైల్వేగేటు మూశారు.. కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చారు
వీటితో పాటు నగర శివారు మాధవనగర్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ ఏడు నిర్మాణాల్లో ఒక్క మాధవనగర్ తప్ప అన్నింటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తుండగా దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మాణం సాగుతోంది. ఏడాది కింద పనులు ప్రారంభం కాగా ఇప్పటికే పిల్లర్లు పూర్తి చేసుకుంది. రైల్వే గేట్ ఇరు వైపులా పిల్లర్లు పూర్తి చెయ్యగా వాటిపై దిమ్మెలు ఏర్పాటు చేసి ఇరు వైపులా రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.
రైల్వే గేటు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ పడినప్పుడు గంటల కొద్ది వేచి చూస్తున్నాం. అత్యవసర సమయాల్లో అయితే పరిస్థితి మరి ఇబ్బందికరంగా ఉండేది. తొందరగా రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కోరుతున్నాం. తద్వారా మా ప్రయాణాలు సాఫీగా సాగిపోతాయి. - స్థానికులు
నిజామాబాద్-హైదరాబాద్‌కు ప్రధాన రహదారి కావడంతో గేట్ పడిన ప్రతిసారీ ప్రజలు నరకం చూస్తున్నారు. ఆసుపత్రి, కార్యాలయాలు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైళ్ల రాకపోకలు విరివిగా ఉన్నందున రైలు వచ్చిన ప్రతిసారీ గేటు వేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దశాబ్ధాలుగా రైల్వే గేట్‌లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం జరుగుతున్న ఆర్వోబీల నిర్మాణాలతో రవాణా తిప్పలు తప్పనున్నాయి.
ఆదిలాబాద్‌లో రైల్వే వంతెనల పనులకు నిధుల గ్రహణం - ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి
రైల్వేగేటుపై ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం - ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు