Rail Under Rail Bridge in Kazipet : నగరాలు, జాతీయ రహదారుల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్లు కడతారు. బైపాస్ రోడ్లు నిర్మిస్తారు. రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకు రైల్వే శాఖ కూడా బైపాస్ లైన్లు, రైల్ ఓవర్ రైల్(ఆర్‌ఓఆర్) వంతెనలు నిర్మిస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో భూసేకరణ సమస్యలు వస్తున్నాయి. కొన్నిచోట్ల సేకరిద్దామన్నా భూమి అందుబాటులో ఉండదు. చుట్టూ నివాస, ఇతర భవనాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నచోట రైల్వేశాఖ వినూత్నంగా రైల్ అండర్ రైల్(ఆర్‌యూఆర్) వంతెనలు నిర్మిస్తోంది.
అండర్ రైల్ వంతెనలంటే నేలపై నుంచి ఒక రైలు వెళ్తే, మరోరైలు కింది నుంచి ప్రయాణం చేస్తుంది. నేలపైన ఉన్న పట్టాల కింద, అంటే భూగర్భంలో మరో రైలు మార్గాన్ని కొత్తగా నిర్మించడం అన్నమాట. కోమటిపల్లి-కాజీపేట సెక్షన్‌లో నిర్మిస్తున్న ఆర్‌యూఆర్, జోన్ పరిధిలోనే మొదటిదని దక్షణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఈటీవీ భారత్‌కు తెలిపారు.
11చోట్ల రైల్ ఓవర్ రైల్ వంతెనలు: జోన్ పరిధిలో 11 చోట్ల రైల్ ఓవర్ రైలు వంతెనలున్నాయి. కింద నుంచి ఒక రైలు వెళ్తుంటే, పైనుంచి మరొక రైలు వెళ్తుంది. ఇలాంటి వంతెనలు విజయవాడ సమీపంలో రెండు గూడూరు, అకోలా సమీపంలో ఒక్కోటి అమ్ముగూడ, లాలాగూడ, మేడ్చల్ సమీపంలో రెండు ఉన్నాయి.
నిర్మాణంలో ఉన్న భూగర్భ రైలు మార్గం: దేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కాజీపేట జంక్షన్ కీలకమైంది. దిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే, ‘వై ఆకారంలో రెండుగా చీలిపోతుంది. ఒకవైపు వెళ్తే కాజీపేట మార్గం. ఇది కిలోమీటరు దూరం. మరోవైపు వెళ్తే వరంగల్ స్టేషన్. ఇది 10 కిలోమీటర్ల దూరం. దిల్లీ - సికింద్రాబాద్ రైళ్లు కాజీపేట మీదుగా, దిల్లీ - విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో, వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్ రద్దీగా మారుతుంది.
మరీ ముఖ్యంగా వరంగల్ వైపు గూడ్సు రైళ్లు వెళ్లేంతవరకు, దిల్లీ, బల్లార్షాల వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లను వడ్డేపల్లి చెరువు ప్రాంతం (కాజీపేట స్టేషన్ ఔటర్)లో ఆపుతున్నారు. దీంతో ఆయా రైళ్ల ప్రయాణం ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను నివారించి బల్లార్షా - సికింద్రాబాద్, విజయవాడ - బల్లార్షా, సికింద్రాబాద్ - విజయవాడ, ఇలా అన్ని మార్గాల్లో రైళ్లు సాఫీగా రాకపోకలు సాగించేందుకు కోమటిపల్లి - వరంగల్ మధ్య బైపాస్ లైన్‌ను దక్షణమధ్య రైల్వే నిర్మిస్తోంది. రూ.125 కోట్ల వ్యయంతో, 21.47 కి.మీ. మేరకు భూగర్భ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
బైపాస్ లైన్‌లో 3 పెద్ద వంతెనలతో పాటుగా, 31 చిన్న వంతెనలు రానున్నాయి. బైపాస్ కోసం 7.8 హెక్టార్ల భూమిని సేకరించారు. అయితే, ఒకచోట భవనాల కారణంగా భూసేరణ సాధ్యం కాలేదని, అందుకే ఆ ప్రాంతం వరకు భూ ఉపరితలంపై ప్రస్తుతం ఉన్న రైలు మార్గం కింద, మరో రైలు మార్గం నిర్మిస్తున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. కోమటిపల్లి నుండి వడ్డేపల్లి చెరువు వరకు, భూగర్భంలో 340 మీటర్ల మేర సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3, 4 నెలల్లో భూగర్భ మార్గం పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కోమటిపల్లి దగ్గర భూఊపరితలం నుండి రైలు మెల్లమెల్లగా కిందికి దిగుతుంది. అండర్‌గ్రౌండ్‌లో సుమారు 340 మీటర్లు ప్రయాణం చేసి, ఆ తర్వాత మెల్లమెల్లగా పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితలానికి చేరుకుంటుంది. ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో నడిచేందుకు వీలుగా, భూగర్భంలో విద్యుదీకరణ పనులను సైతం చేయనున్నారు. అండర్‌గ్రౌండ్ మార్గం పనులు మినహా.. మిగతా బైపాస్ లైన్ పనులు కొనసాగుతున్నాయి. వీటికే ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. బైపాస్ పూర్తయితే హసన్‌పర్తి రోడ్ నుంచి అటు వరంగల్ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించొచ్చని అధికారులు తెలిపారు. బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్ వైపు వచ్చే రైళ్లకు క్రాసింగ్ సమస్యలు తీరిపోతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.