Raids on Rice Mills in Suryapet District : సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, గరిడేపల్లి, తుంగతుర్తిలోని రైస్ మిల్లులపై అధికారులు సోదాలు జరిపారు. సుమారు 15 మిల్లులపై విజిలెన్స్, పౌరసరఫరా, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. కొంత మంది మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడ్డారన్న అధికారులు మిల్లుల్లోని రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుమారు రూ.300 కోట్ల చెల్లింపుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని తెలిపారు. ఇంతటి స్థాయిలో ఏకకాలంలో దాడులు నిర్వహించడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ బియ్యం (CMR Frauds in Telangana) చెల్లింపుల్లో గతం నుంచి సూర్యాపేట జిల్లా అట్టడుగునా ఉంటోంది.
అవును.. వాళ్లు బియ్యం ఎగ్గొట్టారు.!.. అయినా కేటాయించండి
Custom Milling Rice Issues in Telangana : తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్ ఇవ్వడానికి ఆరు నెలల గడువు ఉంటుంది. చాలామంది మిల్లర్లు వివిధ కారణాలు చూపిస్తూ రెండు సీజన్ల(సంవత్సరం) తర్వాతే ఇస్తున్నారు. మరికొందరు ఏడాదిన్నర, రెండు సంవత్సరాల వరకు ఇవ్వడం లేదు. అధికారుల సోదాలు, ఒత్తిళ్లు పెరిగినప్పుడు కొందరు తర్వాత సీజన్‌లో వచ్చే ధాన్యంతో సర్దుబాటు చేస్తే మరికొందరు అన్నదాతల నుంచి అప్పటికప్పుడు కొనుగోలు చేసి ధాన్యం ఉన్నట్లు చూపిస్తున్నారు.
పోలీసుల అదుపులో మిల్లర్ల సంఘం కీలక నాయకుడు : ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్ల విలువైన బియ్యం ఎగవేత ఆరోపణలతో సూర్యాపేట జిల్లాకు చెందిన మిల్లర్ల సంఘం కీలక నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నాలుగు మిల్లుల్లో కలిపి సదరు నేత సుమారు రూ.200 కోట్ల బియ్యం (Paddy scam in Telangana) ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా బకాయిలతో పాటూ తాజాగా సీజన్‌లో సహకరించపోవడంతో జిల్లా యంత్రాగం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఓ కీలక నాయకుడి ఆదేశంతో సదరు నేతను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎంఆర్ ధాన్యం అనేది ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. సాధారణ తనిఖీల్లో భాగంగా మిల్లులపై సోదాలు చేపట్టాం. మిల్లుల్లోని ధాన్యం రికార్డులను పరిశీలించాం. అందులో తప్పులున్నట్లు గుర్తించాం .ఈ మేరకు నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపిస్తాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. - లత, సూర్యాపేట అదనపు కలెక్టర్
గతంలో బ్లాక్‌లిస్టులో పెట్టి తిరిగి ధాన్యం కేటాయింపులు చేస్తున్న మిల్లుల్లోని రికార్డులను అధికారులు సమగ్రంగా తనిఖీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ అక్రమాలపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాలతోనే ఈ సోదాలు చేపట్టామని పలు మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు పక్కా ఆధారాలు లభించాయని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ముమ్మరంగా తనిఖీలు చేసి ఉన్నతాధికారుల సూచనతో తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
Farmer Problems At Rice Mills : మిల్లర్ల మాయాజాలంతో దగా పడుతున్న రైతన్న.. అడ్డుకట్ట పడేనా..?