Puvvada Ajay Fires On CM Revanth : వరద బాధితులను కాపాడే విషయంలో మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. వరదలో చిక్కుకున్న వారికి బీఆర్ఎస్ నేతలు సాయం చేస్తుంటే, కాంగ్రెస్ వారు దాడులు చేశారని ఆరోపించారు. వరద బాధితులను కాపాడటంలో మంత్రులు విఫలం అయ్యారని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు గుప్పించారు.
'డైవర్షన్ సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ వెళ్లి నా వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడారు. ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ఉంటారా అని నాకు అనిపిస్తోంది. పైనుంచి వచ్చిన వరద అంచనా వేయకుండా, ప్రజలను అప్రమత్తం చేయకుండా నాపై బురద జల్లుతున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క హెచ్చరిక కూడా రాలేదు. ప్రజలను గాలికి వదిలేశారు. రాత్రి పూట వరద వచ్చి ఉంటే, వేల మంది వరదలో కొట్టుకుపోయేవారు' అని పువ్వాడ అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలా పర్యటించారు : వరద ప్రాంతానికి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎన్నికల ప్రచారంలా పర్యటించారని పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. చిట్ చాట్లో తనపై బురద జల్లితే ప్రజలకు సాంత్వన కలుగుతుందా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక ఇంచి జాగా ఆక్రమణ ఉన్నా కూల్చివేయాలని సవాళ్ చేశారు. ఎలాంటి విచారణ అయినా చేసుకోవాలని తెలిపారు. తన అసుపత్రి పరిసర ప్రాంతాల్లోకి ఒక్క చుక్క నీరు కూడా రాలేదని స్పష్టం చేశారు.
ఖమ్మం గురించి కనీస అవగాహన లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై పువ్వాడ మండిపడ్డారు. కేసీఆర్ వరద సాయం, దీక్షలు, చేస్తే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు? అని ప్రశ్నించారు. మంత్రులు, యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందారని, వాగుపై చిక్కుకున్న వారిని వదిలేశారన్నారు. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్న పువ్వాడ అజయ్ ఆధారాలుంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు.
"వరద బాధితులకు సరుకులు అందజేసే కార్యక్రమంలో ఉండగా మా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలతో దాడి చేయించిన విషయం మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. మంత్రులు విఫలం అయ్యారని ఖమ్మం జిల్లాలో ప్రజలే చర్చించుకుంటున్నారు. పై నుంచి వచ్చిన వరదను అంచనా వేయలేక ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు"- పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ నేత
శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలి : మున్నేరుకు ఇరు వైపులా రిటైనింగ్ వాల్ ను కేసీఆర్ మంజూరు చేశారని పువ్వాడ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టి 9 నెలలైనప్పటికీ ఇంకా పనులు ప్రారంభించలేదన్నారు. భౌతికంగా తనను అంతమొందిస్తే ఖమ్మం వరద బాధితుల కష్టాలు తీరుతాయా? అని ప్రశ్నించారు. మంత్రుల నిర్మాణాలే ఆక్రమణలు ఉన్నాయని ప్రజలే చెప్తున్నారు, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని అన్నారు.
మంత్రులు ఆదర్శంగా నిలవాలంటే వారి ఫంక్షన్ హళ్లు, విల్లాల నుంచి మొదలు పెట్టాలని హితవు పలికారు. ఖమ్మంలో ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మున్నేరు నది నుంచి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు. 'మంత్రి తుమ్మల దాడులను ప్రోత్సహించడం లేదని అంటున్నారు చిత్తశుద్ది ఉంటే ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. సంబంధం లేదని తప్పించుకుంటే సరిపోదని చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించాను : మంత్రి పువ్వాడ అజయ్