Agriculture BSC Course At Jayashankar University : ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ కోటా కింద 227 సీట్లుండగా మరో 200 పెంచినట్లుగా వర్సిటీ ఉపకులపతి(వీసీ) అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ సీట్లకు ప్రవేశ, వార్షిక రుసుములను తగ్గించినట్లు పేర్కొన్నారు.
ప్రవేశ రుసుం తగ్గింపు : ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశ రుసుం రూ.3 లక్షలు ఉండగా రూ.65 వేలకు, 4 ఏళ్లకు కలిసి మొత్తం రుసుం రూ.10 లక్షలు ఉండగా రూ.5 లక్షలకు తగ్గించినట్లుగా ఆయన వివరించారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను భర్తీ చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ అగ్రికల్చర్ వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాలల్లో సీట్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ సీట్లకోసం రెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.
200 సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెంపు : ప్రస్తుతం కన్వీనర్ కోటాలో 615 సీట్లున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కింద 227 ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో సీట్లలో 98 శాతానికి పైగా భర్తీ అయ్యాయి. దీంతో చాలామంది విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను ఆశిస్తున్నారు. ప్రవేశ రుసుములు భారీగా ఉండడంతో పేద విద్యార్థులకు అందుబాటులో లేవనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త ఉపకులపతి జానయ్య దృష్టికి తెచ్చారు. ప్రభుత్వంతో ఆయన చర్చించిన అనంతరం సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు పెంచాలని నిర్ణయించారు.
Agriculture BSC Self Finance Quota : ఇప్పటికే ఉన్న 227సీట్లకు అదనంగా 200 సెల్ఫ్ ఫైనాన్స్సీట్లు కలిపారు. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 427కి చేరింది. పెరిగిన సీట్లను వ్యవసాయ కళాశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం వీటికి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. తగ్గించిన ఫీజులను ఈ అకాడమిక్ ఇయర్ నుంచే అమల్లోకి వస్తాయి. కాగా గతంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద చేరిన విద్యార్థులు పాత రుసుములనే చెల్లించాల్సి ఉంటుంది.
విద్యావ్యాపారాన్ని అరికట్టేందుకు : అగ్రికల్చర్ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను పెంచామని వీసీ జానయ్య తెలిపారు. 'పూర్తిస్థాయి గుర్తింపు లేని కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో రుసుములు చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ డిగ్రీ కోర్సు నిర్వహించడానికి కావలసిన కనీస వసతులు, సిబ్బంది లేకపోయినప్పటికీ ఈ కోర్సులను వ్యాపారపరంగా మార్చుకుని దోపిడీకి పాల్పడుతున్నాయి. విద్యా వ్యాపారాన్ని అరికట్టడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అవసరాలను, స్టూడెంట్స్‌లో పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా సీట్లను పెంచాం. ఫీజులను తగ్గించాం. అదనంగా పెంచుతున్న సీట్ల వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో రెండు మూడు రోజుల్లో పెడతాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం' అని జానయ్య సూచించారు.
స్వల్పకాలిక కోర్సులు : ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందున నైపుణ్యంతో కూడిన వ్యవసాయ పట్టభద్రుల అవసరం పడుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశపెడుతున్న వివిధ కోర్సులతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సులను కూడా ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
గవర్నర్‌ను కలిసిన వీసీ : మరోవైపు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య కలిశారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మర్యాద పూర్వకంగా కలిసిన ఆయన టీచింగ్, పరిశోధన, విస్తరణ రంగాల్లో పురోగతిపై గవర్నర్‌కు వివరించారు.