President Droupadi Murmu Visit to Hyderabad Today : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 12 గంటలకు హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. హకీంపేట నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలో జస్టిస్ సిటీలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
రాష్ట్రపతి పర్యటనకు మినిస్టర్ ఇన్వెయిటింగ్గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నామినేట్ చేసింది. స్వాగతం నుంచి వీడ్కోలు వరకు రాష్ట్రపతి వెంటే మంత్రి సీతక్క ఉండనున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నల్సార్ ఛాన్స్లర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నర్సింహ పాల్గొంటారని యూనివర్సిటీ ఉపకులపతి క్రిష్ణదేవరావ్ వెల్లడించారు.
592 మంది పట్టభద్రులకు పట్టాలు : ఇప్పటికే స్నాతకోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ అధికారులు, పోలీసులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను అందజేయనున్నారు. పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉత్తీర్ణులైన 592 మంది పట్టభద్రులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానోత్సవం చేయనున్నారు. ఇప్పటికే యూనివర్సిటీ యాజమాన్యం స్నాతకోత్సవ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు సంబంధిత ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసులు పర్యవేక్షిస్తూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రపతి నిలయంలో కార్యక్రమానికి హాజరు : అనంతరం అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్-2024 కార్యక్రమానికి హాజరు కానున్నారు. నేటి నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న కళా మహోత్సవాలను సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. రాష్ట్రపతితో పాటు పది మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా రాష్ట్రపతి సమక్షంలో కళాకారులు నృత్య, కళారూపాలు ప్రదర్శించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు : రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రతా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి బేగంపేట, హెచ్‌పీఎస్, పీఎన్టీ జంక్షన్ రసూల్‌పురా, సీటీఓ, ప్లాజా, తివోలి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ఏరియాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని వెల్లడించారు. సాయంత్రం 5.45 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతి తిరిగి దిల్లీ పయనం అవ్వనున్నారు.
అబ్బురపరుస్తున్న రాష్ట్రపతి భవన్ - ఇకపై సంవత్సరం పొడవునా సందర్శనకు అనుమతి