Prathidwani on IT Development in Andhra Pradesh : ఒకప్పుడు ఐటీ అంటే ఆంధ్రప్రదేశ్! ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అన్నంతగా దేశ, విదేశాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఆ పేరు నిలబెట్టేందుకు గట్టి పునాదులే వేసే ప్రయత్నాలు జరిగాయి. 2014-2019 మధ్య అనేక ఐటీ సంస్థల్ని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, అంకురాలకూ ప్రోత్సాహమిస్తూ ఐటీ పటంలో సుస్థిర స్థానం కోసం బాటలు వేశారు. ఆర్ధికవృద్ధి, మెరుగైన ఉపాధికి అదే మేలైన మార్గమని అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఆ కృషికి అనుకోని విఘ్నంలా అడ్డం పడింది 5ఏళ్ల వైఎస్సార్సీపీ పాలన. ఐటీలో మేటి అన్న స్థితి నుంచి బిమారూ రాష్ట్రాల కంటే అథమస్థానానికి పడేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కొలువైన కూటమి ప్రభుత్వం ముందు ఐటీకి ఊతం కోసం జరగాల్సిన ప్రయత్నమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ఐటీ పారిశ్రామికవేత్త, సింబియాసిస్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఓ నరేష్ కుమార్, సీఐఐ ఏపీ మాజీ అధ్యక్షుడు డి. రామకృష్ణ..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరున్న సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు ఐటీ శాఖ మంత్రి లోకేశ్ (Minister Nara Lokesh) సూచించారు. త్వరలోనే నూతన ఐటీ పాలసీ తీసుకొస్తామన్నారు. ఈ విషయం గురించి ఐటీ శాఖ ముఖ్య అధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, ప్రత్యేక కార్యదర్శి బి.సుందర్, టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ ఎం.రమణారెడ్డి, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ అనిల్‌కుమార్, ఆర్టీజీఎస్ డైరెక్టర్ చెరుకువాడ శ్రీరామ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఐటీ పరిశ్రమల్ని తీసుకురావడానికి ప్రకటించాల్సిన ప్రోత్సాహకాలు, ఇప్పటికే ఏర్పాటైన వాటికి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలపై ఆరా తీశారు. విశాఖను ఐటీ హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చడానికి ప్రణాళికల్ని సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.