Prathidhwani on Modi 3.0 Government : పదేళ్ల అనుభవాలు 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలిప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్రమోదీ. ఆ అరుదైన ఘనత ఒకవైపు, పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాలు మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది ? రాజకీయంగా, ప్రభుత్వపరంగా వారి ముందున్న ప్రాధాన్యాలు, సవాళ్లు ఏంటి? ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళికలో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం - ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా ? ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర్, జాతీయ రాజకీయాల విశ్లేషకులు చలసాని నరేంద్ర.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు దీరిన ఎన్డీఏ 3.O సర్కార్ కేబినెట్లో బీజేపీకి 61, ఎన్డీఏ మిత్రపక్షాలకు 11 బెర్తులు లభించాయి. మొత్తం 72మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువుదీరింది. ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఎల్జేపీ(ఆర్ వీ), జేడీఎస్, శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ దళ, అప్నా దళ్, హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి.
కొలువుదీరిన కొత్త మంత్రులు- మరోసారి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్ ఛార్జ్
రాష్ట్రాలవారీగా కేబినెట్ బెర్తులు
మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్లో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మహారాష్ట్రకు మోదీ సర్కార్ పెద్ద పీట వేసింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీకి 9, బిహార్‌కు 8 కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కాయి. మహారాష్ట్రకు 6, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు చెరో 5 కేంద్ర మంత్రి పదవులు వరించాయి. హరియాణా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెరో మూడు, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, బంగాల్, కేరళకు చెరో రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి.