Prajapalana Vijayotsava Sabha Cultural Programs : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజా పాలనా విజయోత్సవాలు హుషారుగా సాగాయి. వేడుకల్లో భాగంగా హుస్సేన్ సాగర్ వద్ద ఎయిర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 9 సూర్య కిరణ్ విమానాల విన్యాసాలు చూసేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాత్రి ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి.
రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. ఆకాశంలో కళ్లు చెదిరేలా విమానాల విన్యాసాలు నేలపై జనం కేరింతలతో హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరం హోరెత్తింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఏరోబాటిక్ ప్రదర్శన ప్రత్యక్షంగా వీక్షించిన నగరవాసులను ఆమితంగా ఆకర్షించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా 9 విమానాలతో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ బృందం ప్రదర్శించిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. దాదాపు 25 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి తిలకించారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఐమాక్స్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరయ్యారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలను విన్నారు. అక్కడికి భారీగా వచ్చిన జనం పాటలకు ఉర్రూతలూగారు. పాటలతో అలరించిన రాహుల్ సిప్లిగంజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి అంజలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విజయోత్సవాలతో విద్యుత్ కాంతులతో ట్యాంక్‌బండ్ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. వారాంతం కావడంతో పెద్ద ఎత్తున ప్రజలు కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఇక్కడి అందాలని తిలకించారు. ఎన్టీఆర్ గార్డెన్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం,ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ఆయా వేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జానపద పాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది.
అంబరాన్నంటిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు - ఆకట్టుకున్న సంగీత కార్యక్రమం
'ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించారా? - ఇప్పుడు గాలి బ్యాచ్‌లను ప్రజలపై వదిలారు'