AP Population Declining in South India : ‘దేశ ప్రయోజనాల కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్నవారినే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తేబోతున్నాం’ అని ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఓ సామూహిక వివాహ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంలో ‘భవిష్యత్లో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల కారణంగా పార్లమెంట్ సీట్లు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇందుకు కొత్త దంపతులు 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు?’ అని నవ్వుతూ అన్నారు.
వాటాను కోల్పోతున్న దక్షిణం : నిజానికి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంది. దక్షిణాదిలో ఆ రేటు పడిపోతోంది. కారణం ఇక్కడ కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు పటిష్ఠంగా అమలు కావడమే. తద్వారా 2011 జనాభా లెక్కల నాటికే ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య సమతౌల్యం దెబ్బతింది. దీంతో ఆర్థిక సంఘం సిఫార్సుల్లో దక్షిణాది రాష్ట్రాలు తమ వాటాను కోల్పోయాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన సీఎం చంద్రబాబు పది సంవత్సరాల క్రితం నుంచే జనాభా పెంపు గురించి చెబుతున్నారు. ఇప్పుడు ఆయనకు ఎంకే స్టాలిన్ స్వరం కూడా తోడయింది.
పడిపోతున్న సంఖ్య : ఇదిలా ఉంటే ఏపీలో కుటుంబం చిన్నబోతోంది. ఒక్కో కుటుంబంలోని సగటు సభ్యుల సంఖ్య 3.7కి పడిపోయింది. ఇది జాతీయ సగటు (4.3)తో పాటు, తమిళనాడు, తెలంగాణ (4.1)చొప్పున, కర్ణాటక (4.3), కేరళ(3.8) కంటే తక్కువే. నాబార్డ్ సంస్థ తాజాగా విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-2022 ప్రకారం ఈ విషయం వెల్లడైంది.
2015 జులై 1 నుంచి 2016 జులై మధ్యకాలంలో నాబార్డు సర్వే చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఒక్కో కుటుంబంలో సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 3.5 మేర ఉండగా, ఇప్పుడు 3.7కి చేరింది. తెలంగాణలో 3.8 నుంచి ప్రస్తుతం 4.1కు చేరింది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల కంటే సగటు కుటుంబసభ్యుల సంఖ్య తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. ఈ సంఖ్య అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 5, బిహార్లో 4.8గా ఉంది.
'2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ' - క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సూచన
పెరిగిన నెలవారీ ఆదాయం : ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 నుంచి రూ.11,037కి పెరిగింది. అంటే 88.92శాతం వృద్ధి చెందింది. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో సగటు కుటుంబ ఆదాయం రూ.8,059 నుంచి రూ.12,692కి పెరిగింది. అంటే 57.56 శాతం.
సగటు కుటుంబ వ్యయం : గత సర్వే నాటికి, ఇప్పటికి పోలిస్తే నెలవారీ కుటుంబ వినియోగ వ్యయం రూ.5,746 నుంచి .10,448 రూపాయలకి చేరింది. జాతీయ సగటు వ్యయం రూ.8,059 నుంచి రూ.11,262కి పెరిగింది. ఏపీలో ఒక్కో కుటుంబానికి 2016-17లో నెలకు రూ.95 మిగలగా, ఇప్పుడు అది రూ.589కి పెరిగింది. పంజాబ్‌లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ. 5,683 ఆదాయం మిగులుతుంది. బిహార్, ఏపీ, ఝార్ఖండ్, తెలంగాణలోని కుటుంబాల వద్ద మిగులు అతి తక్కువగా ఉంటోంది.