Ponnam Prabhakar Started New Electric Buses In Karimnagar : టీజీఎస్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్‌కు కేటాయించిన 74 బస్సుల్లో తొలి విడతలో 33 విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈ బస్సులను నడపనున్నారు. జేబీఎస్ సంస్థ ఎన్‌ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానునట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న పొన్నం, ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి, దసరా పండుగలోపు పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని పేర్కొన్నారు.
"ఆర్టీసీనే స్వయంగా బస్సులు కొనుగోలు చేసింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆర్టీసీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. అలాగే ప్రభుత్వం గ్రాట్యుటీ పైన కొన్ని బస్సులు తీసుకుని నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. పీఆర్సీ కావొచ్చు, నియమాకాలు కావొచ్చు, మిగితావి ఏవైనా సమస్యలు ఉంటే చర్చించి ఆర్టీసీని మరింత సమర్ధవంతంగా నడిపించేందుకు కృషి చేస్తాం." - పొన్నం ప్రభాకర్, మంత్రి
300 రోజులకు చేరిన మహాలక్ష్మి పథకం : అంబేడ్కర్ స్టేడియంలో బస్సులను ప్రారంభించి, అదే బస్సులో ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని కరీంనగర్-2 డిపోలో ఛార్జింగ్ స్టేషన్ పరిశీలించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డీజిల్‌తో నడిచే బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా పాలన ఏర్పడిన తర్వాత విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీని దినదినాభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుంచి రూ.3200 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్న మంత్రి, ఆర్టీసీ బస్సులకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందన్నారు. డిసంబర్ 9న ప్రారంభమైన మహాలక్ష్మి పథకం మూడు వందల రోజులకు చేరిందని, ఇప్పటి వరకు రూ.90 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని పేర్కొన్నారు.