Telangana assembly Sessions : తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరు 9వ తేదీ నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టం చేయనున్నట్లు తెలిపారు. గురువారం (నవంబర్ 21)న అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రైతుల సమస్యలన్నింటికీ చరమగీతం పాడేందుకు కొత్త ఆర్వోఆర్(రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దీనిపై సభలో చర్చ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ధరణి చట్టాన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వంలోని వారు అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
రంగనాయకసాగర్ భూసేకరణ నోటిఫికేషన్ పేరుతో రైతులను దగ్గర నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారనేది స్పష్టమవుతోందని తెలిపారు. భూములు తీసుకుని నోటిఫికేషన్‌ను రద్దు చేశారన్నారు. కానీ ఇందుకు చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందన్నారు. హరీశ్‌రావు నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారో లేదో విచారణలో బయటికొస్తుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేశాక రద్దు చేయడం అంత సులువైన పని కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపన్‌పల్లి భూములను భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా సేకరించారన్నారు. అవి ఇప్పటికీ ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయని గుర్తు చేశారు.
నా స్థానం 11, భట్టి 2 వ స్థానం : రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు 07 నాటికి ఏడాది పూర్తవుతున్నందున ఆలోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో విద్యుత్ కమిషన్ నివేదిక, ఈ-కార్ అంశాలపై చర్చ ఉంటుందని వెల్లడించారు. రైతు, కులగణన సర్వేలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని తెలిపారు. ఆలోగానే ఆసరా పింఛన్లు, రైతు భరోసా అమలుకు ప్రక్రియ మొదలైనట్లు చెప్పారు. ప్రభుత్వంలో తాను 11వ స్థానంలో ఉన్నానని, రెండో స్థానంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారంటూ మంత్రి పొంగులేటి జవాబిచ్చారు. పలుమార్లు కేటీఆర్ పొంగులేటిని 2 స్థానం మంత్రి అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తొందరపడటం లేదు : ప్రభుత్వం ఏ విషయంలోనూ తొందరపడటం లేదని మంత్రి పొంగులేటి చెప్పారు. అన్ని అంశాలపై పూర్తి ఆధారాలు సిద్ధమయ్యాకే చర్యలు ఉంటాయన్నారు. కేటీఆర్ అరెస్టు విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణలపై ఆయన స్పందించారు. కేటీఆర్‌పై కేసు నమోదు దస్త్రం గవర్నర్ వద్ద ఉందని తెలిపారు. వాళ్లు అనుకుంటే గవర్నర్ అనుమతి ఇచ్చేలా చూడొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
'వాడివేడి చర్చలతో ముగిసిన అసెంబ్లీ సమావేశాలు' - Telangana Assembly Session