Police Third Degree on TDP leaders: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా కొంతమంది పోలీసులు ఇంకా వైసీపీ సేవలోనే తరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో తెలుగుదేశం నాయకులపై దాడి ఘటనే దీనికి నిదర్శనం. కౌన్సిలింగ్ పేరుతో తెలుగుదేశం నాయకులను తీసుకెళ్లి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం సృష్టించింది. కోడ్ వచ్చినా పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహిస్తున్నారంటూ విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీని డిమాండ్ చేశారు.
ఎన్నికలు సజావుగా సాగాలంటే రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారు, అల్లర్లు సృష్టిస్తారనే అనుమానం ఉన్నవారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తారు. లేదంటే బైండోవర్ చేస్తారు. కానీ కర్నూలులో మాత్రం పోలీసులు వైసీపీ సేవలో పులకిస్తూ తెలుగుదేశం నాయకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
8వ వార్డు కార్పొరేటర్ పరమేష్, సీనియర్ నాయకుడు శేషగిరి, 8వ వార్డు బూత్ ఇన్‌ఛార్జి శ్రీకాంత్‌ను మీటింగ్ ఉందని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కి పిలిపించారు. అక్కడి నుంచి డీఎస్పీ కార్యాలయానికి రావాలని పోలీసులు వారి వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. అయితే డీఎస్పీ కార్యాలయానికి కాకుండా నగర శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడ బట్టలు విప్పించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. ఏం నేరం చేశామని ప్రశ్నించినందుగానూ మరింత తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై విపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులపై దాడి చేసిన పోలీసులను వదిలే ప్రసక్తి లేదని కర్నూలు తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ మండిపడ్డారు. కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌ని కలిసి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని కోరారు.
"పక్కా ప్లాన్ ప్రకరమే మమ్మల్ని పోలీసు శిక్షణా కేంద్రానికి పోలీసులు తీసుకునిపోయారు. మా షర్టులు విప్పించి మరీ లారీ టైర్ పట్టాతో దాడిచేశారు. ఏం నేరం చేశామని ప్రశ్నించినందుగానూ మరింత తీవ్రంగా కొట్టారు. టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్నామనే కారణంతోనే మమ్మల్సి కొట్టారు. మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీఐ ఆదినారాయణరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." - బాధిత టీడీపీ నేతలు
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign