Police Destroy Liquor Bottles with Bulldozer : కళ్ల ముందు ఒక విస్కీ బాటిల్ లేదా బ్రాందీ సీసా ఉంటేనే 'ఎప్పుడు మూత తీసి గొంతులో పోసుకుందామా' అని మందుబాబులు ఎదురుచూస్తుంటారు. అలాంటిది వంద కాదు రెండు వందలు కాదు ఏకంగా వేలాది మందు సీసాలను కళ్ల ముందే పోలీసులు ధ్వంసం చేస్తుంటే ఇక ఊరుకుంటారా సురాపానీ ప్రియులు. వారికి ప్రాణం పోయినంత పనైంది.
ఏపీలోని గుంటూరు జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేస్తుంటే మందుబాబులు చూస్తూ ఆగలేకపోయారు. ఖాకీలు లాఠీలు పట్టుకుని వారిస్తున్నా ఏ మాత్రం భయపడక విస్కీ, బ్రాందీ, రమ్ము, బీరు సీసాలను సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. పోలీసులు చూస్తుండగానే మద్యం సీసాలు తీసుకొని ఊడాయించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా మద్యం పట్టివేత - 12మంది అరెస్టు - Liquor Caught in Shamshabad Airport
గుంటూరు జిల్లా వ్యాప్తంగా రూ.50 లక్షలు విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఏటూకూరు రోడ్డులో నల్లచెరువులోని డంపింగ్‌యార్డులో మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన స్థానిక మందుబాబులు అక్కడకు చేరుకున్నారు. తమ కళ్లముందే మద్యం బాటిళ్లను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఉండలేకపోయారు.
యార్డు పరిసరాల్లోని మందుబాబులకు ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు వాటిని తీసుకొని పారిపోదామా అని సరైన సమయం కోసం ఎదురుచూశారు. సాధారణంగా భారీ సంఖ్యలో మద్యం సీసాలు ఉన్నప్పుడు వాటిని రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేస్తుంటారు. అయితే ఈసారి మాత్రం పొక్లెయిన్ తీసుకురావడంతో మద్యం సీసాలను పగలగొట్టడానికి సమయం పట్టింది. ఇదే మందుబాబులకు అదునుగా మారింది.
ఆగలేకపోయాం సార్: వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించిన కొద్దిసేపటికి ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గ్రూపులుగా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా కూడా వారికి మద్యం సీసాలు మాత్రమే కనిపించాయి. దొరికిన వారు దొరికినట్లు వివిధ రకాల మందు సీసాలను పట్టుకెళ్లారు. అయితే బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఆగలేకపోయాం సార్ అని కొంతమంది మందుబాబులు పోలీసులతో పేర్కొనడం గమనార్హం.