Man Died After Jumping From The Building : పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి మూడవ అంతస్థుపై నుంచి దూకడంతో మృతి చెందాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, లాలాపేటలోని శాంతినగర్‌కు చెందిన వినయ్ కుమార్(35) ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లక్ష్మీనగర్ ప్రాంతంలోని ఓ భవనంపై కొందరు వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా జూదం అడుతున్నారు.
అయితే, వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా రాత్రి 10 గంటల సమయంలో ఆ చోటుకు వెళ్లాడు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూద గృహంపై దాడి చేశారు. పోలీసులను గమనించిన కొందరు పేకాటరాయుళ్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. వినయ్ కుమార్ కూడా తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్ర గాయాలైన వినయ్‌ను స్థానికులు అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్‌లోని సమీప యశోదా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేసు నమోదు చేసుకున్న లాలాగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినయ్ కుమార్‌కు పేకాట ఆడటం రాదని, తోటి స్నేహితులు ఆడుతుంటే చూడడానికి వెళ్లాడు తప్ప అతనికి అడటానికి రాదని ఆరోపిస్తున్నారు. పోలీసుల భయంతోనే బిల్డింగ్‌పై నుంచి దూకాడని, ఇప్పుడు వాళ్ల భార్యా పిల్లల పరిస్థితి ఏంటని మండిపడ్డారు. వినయ్ కుమార్ భార్య పిల్లలకు తగిన న్యాయం చేయాలని కోరారు.
ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఫైనాన్స్ వ్యాపారి : మరోవైపు సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో జగదీశ్ అనే ఫైనాన్స్ వ్యాపారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు తన బంధువులకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా, బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. స్నానానికి వెళ్తున్నానని చెప్పి బాత్రూంలో వెళ్లి ఎంతకి తిరిగి రాకపోయేసరికి, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆత్మహత్య చేసుకున్నాడని జగదీశ్ భార్య తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాకి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను కొట్టిన భర్త- భయంతో కాసేపటికే ఆత్మహత్య!
మహబూబాబాద్ జిల్లాలో విషాదం - హెయిర్ కట్ నచ్చలేదని బాలుడి ఆత్మహత్య