Polavaram Residents Votes: వాళ్లంతా పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు. పునరావాస ప్యాకేజి కోసం ఎన్నో దరఖాస్తులు పెట్టుకున్నారు. అవన్నీ చెత్తబుట్టలో వేస్తూ పోతున్న ప్రభుత్వం కొత్త క్రీడకు తెరతీసింది. వాళ్లకు తెలియకుండానే వాళ్ల ఓట్లను గంపగుత్తగా బదిలీ చేసేసింది. ఈ రాజకీయ నేరపూరిత కుట్రకు అధికారపార్టీకి చెందిన ఓ అరాచక శక్తే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. ఓటరు కార్డుల్లో కొన్నింటిని గమనించినప్పుడు ఓటరు కార్డు రెండింటిలో పేరు, తండ్రి పేరు,ఫోటో ఒకటే ఉంది. మేడిపండు విప్పిచూస్తే పురుగులున్నట్లు అదే కార్డు తిప్పిచూస్తే గానీ అధికారుల నిర్వాకం బయటపడదు. రెండు కార్డుల్లోనూ రోడ్‌నంబర్ 1-68 ఉంది. కానీ, చిరునామా మాత్రం పాతది తొయ్యేరులో ఉంటే కొత్త కార్డులో ఆర్ ఆర్ కాలనీ కృష్ణునిపాలెం అని ఉంది.
చంద్రబాబు, లోకేశ్‌ను తిడితేనే పదవులా? - రాష్ట్రాభివృద్ధి బాబుతోనే సాధ్యం : ఎమ్మెల్యే వసంత
ఓటరుకార్డులో ఉన్న దుర్గాదేవి అసలు తన ఓటు మార్చాలని ఎలాంటి దరఖాస్తూ చేయలేదు. అధికారులే పనిగట్టుకుని చేసేశారు. ఆమె ఒక్కరిదే కాదు ఇక్కడ ఓటరు జాబితాను కంగారుగాచూస్తున్న అందరిదీ అదే పరిస్థితి. దాదాపు 2400 మంది పోలవరం నిర్వాసిత ఓటర్లను చెప్పాచేయకుండా బదిలీ చేసేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కృష్ణునిపాలెంలో ఏర్పాటు చేసిన పోలవరం(Polavaram) పునరావాస కాలనీలో, అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని 18 పోలవరం ముంపు గ్రామాల్లోని 1067 గిరిజనేతర కుటుంబాలకు ఇక్కడ పునరావాసం కల్పించారు.
వారిలో 17 గ్రామాల ఓటర్లను రంపచోడవరం నియోజకవర్గ జాబితాలోనే కొనసాగిస్తున్నారు. తొయ్యేరు గ్రామ ఓటర్లను మాత్రం జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోకి మార్చేశారు. ఏ ఒక్కరి నుంచీ అంగీకారం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దేవీపట్నం నిర్వాసితులకు ఇంతవరకూ పునరావాసం కల్పించలేదు. రెండేళ్లుగా ఇళ్లు అద్దెకు తీసుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కానీ వాళ్ల ఓట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికోసమే మా ప్రయత్నం - మాకు బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి : బాబు, పవన్
దీనిలో రాజకీయ కుట్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవీపట్నం మండలంలో అత్యధిక ఓట్లు దేవీపట్నం, తొయ్యేరులోనే ఉన్నాయి. వీళ్లలో అధికశాతం మందికి పునరావాస ప్యాకేజి ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్నికల్లో వాళ్లంతా ఎక్కడ తిరగబడారో అని అధికార పార్టీకి చెందిన ఓ అరాచకశక్తికి అనుమానం వచ్చింది. రాజకీయంగా తాను ఇబ్బంది పడకుండా ఉండాలనే దుర్బుద్ధితో ఇలా చడీచప్పుడు లేకుండా అందర్నీ కట్టకట్టి రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో లేకుండా చేసేశారనే విమర్శలున్నాయి.
పోలవరం నిర్వాసితులకు పరిహారం పునరావాసం పూర్తిస్థాయిలో దక్కాలంటే వారు ఆ ప్రాంతానికి చెందినవారేనని నిరూపించాలి. ఇప్పుడు వేరే ప్రాంత ఓటర్లుగా మార్చేస్తే ఇక పరిహారం అడగే హక్కు ఉంటుందా అని స్థానికులు సందేహిస్తున్నారు. ఐతే తొయ్యేరు గ్రామస్థులు 2020 నుంచి కృష్ణునిపాలెం నిర్వాసిత కాలనీలోనే నివసిస్తున్నారని అందుకే వాళ్ల ఓట్లు అక్కడి మార్చామని రంపచోడవరం సబ్‌కలెక్టర్ ప్రశాంత్ చెప్పారు. అదే నిజమైతే తొయ్యేరు నిర్వాసితులతోపాటే కృష్ణునిపాలెం వచ్చిన మరో 17 గ్రామాల ఓటరు కార్డుల ఎందుకు మార్చలేదనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారనేదీ జవాబులు లేని ప్రశ్నగానే మిగిలింది. ఎన్నికల సంఘం కూడా దీన్ని పట్టించుకోవడం లేదు.
118 మందితో టీడీపీ-జనసేన తొలి జాబితా - ఎమ్మెల్యే అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఇదే